Dil Raju: కార్తికేయ-2 విడుదలలో తనపై జరిగిన ప్రచారం పట్ల నిర్మాత దిల్ రాజు వివరణ

  • దిల్ రాజు నిర్మాణంలో థాంక్యూ చిత్రం
  • జులై 8న రిలీజ్ చేయాలని భావించిన వైనం
  • జులై 22కి విడుదల తేదీ మార్పు
  • అదే తేదీన నిఖిల్ కార్తికేయ-2 
  • కార్తికేయ చిత్రబృందంతో మాట్లాడిన దిల్ రాజు
  • ఆగస్టు 12కు మారిన కార్తికేయ-2 రిలీజ్ డేట్
Dil Raju explains on propaganda against him

కార్తికేయ-2 విడుదల నేపథ్యంలో తనపై జరిగిన ప్రచారం పట్ల ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఇక్కడ ఇతరుల సినిమాలను తొక్కేయాలని ఎవరూ ప్రయత్నించరని స్పష్టం చేశారు. థాంక్యూ విడుదలకు సహకరించాలని కార్తికేయ-2 నిర్మాతలను కోరానని దిల్ రాజు వెల్లడించారు. 

హీరో నిఖిల్, దర్శకుడితో మాట్లాడి, వారు సానుకూలంగా స్పందించిన తర్వాతే థాంక్యూ విడుదల చేశామని వివరించారు. కార్తికేయ-2 మరో తేదీలో విడుదల చేసేందుకు సహకరించానని తెలిపారు. ఒక సినిమా విజయం మరొక సినిమాకు ఊపిరి పోస్తుందని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రతి సినిమా విజయవంతం కావాలనే కోరుకుంటామని, ఓ సినిమా ఆడితే అందరం సంతోషిస్తామని అన్నారు. 

"జులై 8న థాంక్యూ చిత్రాన్ని విడుదల చేయాలని భావించాం. అయితే ఆ రోజున రిలీజ్ సాధ్యంకాలేదు. దాంతో జులై 22న విడుదల చేయాలనుకున్నాం. అదే రోజున కార్తికేయ-2 విడుదల కావాల్సి ఉంది. దాంతో,  ఈ చిత్ర నిర్మాత వివేక్ తో మాట్లాడాను... మా చిత్రానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని అడిగాను. హీరో, డైరెక్టర్ తో మాట్లాడి చెబుతాను అంటూ వివేక్ బదులిచ్చాడు. అనంతరం హీరో నిఖిల్, దర్శకుడు చందు మా ఇంటికి రాగా, చర్చల అనంతరం కార్తికేయ-2 విడుదల తేదీని ఆగస్టు 12కి మార్చుకున్నారు.

వాళ్లు మా పరిస్థితిని అర్థం చేసుకుని విడుదల తేదీని మార్చుకుంటే, కొందరు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. కొన్ని సినిమాలను దిల్ రాజు తొక్కేస్తున్నాడంటూ ప్రచారం చేస్తున్నారు. వ్యూస్ కోసం, క్లిక్కుల కోసం చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లను బలిపశువులుగా చేయొద్దు. సినిమా కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిని నేను. ఇతరుల సినిమాలను పాడుచేయాలని ఎప్పుడూ కోరుకోను. ఒకరి సినిమాలను మరొకరు తొక్కేయరు. తప్పుడు వార్తలు రాసేవాళ్లకు, చదివేవాళ్లకు ఉండాల్సిన కనీస జ్ఞానం ఇది" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.

More Telugu News