Bavajipalem: ఏపీలో 'సైనికుల గ్రామం'... నీటి కోసం అలమటిస్తోంది!

  • గుంటూరు జిల్లా బావాజిపాలెంకు ప్రత్యేకత
  • దాదాపు ప్రతి ఇంటి నుంచి ఓ జవాను
  • ఆర్మీ విలేజ్ గా పేరొందిన వైనం
  • తాగునీటి కోసం ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి
  • ప్రభుత్వాలు పట్టించుకోవాలన్న మాజీ జవాన్లు
Army Village in AP suffers with lack of drinking water

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజిపాలెం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ దాదాపు ప్రతి ఇంటి నుంచి ఓ వ్యక్తి సైన్యంలో పనిచేస్తుండడం విశేషం. అందుకే ఈ ఊరిని సైనికుల గ్రామం (ఆర్మీ విలేజ్) అంటారు. నాడు స్వాతంత్ర్యం కోసం పోరాడినవారిలోనూ బావాజిపాలెం గ్రామస్తులు అనేకమంది ఉన్నారు. గ్రామంలో 2,500 కుటుంబాలు ఉండగా, ఊరి నుంచి ప్రస్తుతం 400 మంది సైన్యంలో పనిచేస్తున్నారు. మరో 1000 మంది జవాన్లు పదవీవిరమణ చేశారు. 

భరతమాత, భారత ఆర్మీ పేరు చెబితే ఇక్కడి యువత గుండెలు ఉప్పొంగుతాయి. ఇక్కడి వారిలో అనేకమంది 1965, 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నారు. 1975లో చైనాతో జరిగిన యుద్ధంలోనూ పోరాడారు. వారిలో పలువురు వీరమరణం పొందారు. ఇప్పటికీ బావాజిపాలెం నుంచి భారత సైన్యంలోకి వెళ్లడానికి యువకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న గ్రామంలో ప్రాథమిక వసతుల లేమి వేధిస్తోంది. ఈ గ్రామ ప్రజలు నేటికీ తాగునీటికి అలమటిస్తుండడం బాధాకరం. 

బిందె నీటి కోసం ఊరి నుంచి నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. సరిహద్దులో శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి దేశాన్ని కాపాడే బావాజీపాలెం జవాన్లు... సెలవుల్లో స్వగ్రామం వస్తే... బిందెలు పట్టుకుని కిలోమీటర్ల కొద్దీ వెళ్లే దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణం. ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, భరతమాత సేవలతో తలమునకలైన గ్రామానికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని మాజీ జవాన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, బావాజిపాలెంలో అత్యధికులు ముస్లింలే.

More Telugu News