Mamata Banerjee: మమతా బెనర్జీపై మండిపడుతున్న కాంగ్రెస్... కారణం ఇదే!

  • ట్విట్టర్ డీపీలో స్వాతంత్ర్య సమరయోధుల జాబితా నుంచి నెహ్రూ ఫోటోను తొలగించిన మమత 
  • మోదీని తృప్తి పరచడం కోసమే అలా చేశారంటూ విమర్శలు 
  • తన కూతురు మీకు హిస్టరీ బేసిక్స్ గుర్తు చేస్తుందంటూ అభిషేక్ బెనర్జీ అనే వ్యక్తి ఎద్దేవా
Congress Targets Mamata Banerjee For  Excluding Nehru Photo

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోల జాబితాను మమత తన ట్విట్టర్ డీపీగా ఉంచారు. అయితే, ఆ మహనీయుల ఫొటోలలో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫొటో లేకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

దీనిపై అభిషేక్ బెనర్జీ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... నెహ్రూ ఫొటోను ఉద్దేశపూర్వకంగానే మమత పెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీని సంతృప్తి పరచడం కోసమే నెహ్రూను తొలగించారని విమర్శించారు. తన కూతురు గీసిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దేశ తొలి ప్రధానిగా ఎర్రకోట నుంచి నెహ్రూ ప్రసంగిస్తున్న చిత్రాన్ని ఆ చిన్నారి గీసింది. 

ఈ ఫొటోను షేర్ చేసిన అభిషేక్ బెనర్జీ... డీపీ నుంచి నెహ్రూను తొలగించగలరే కానీ... చరిత్ర నుంచి మాత్రం కాదని అన్నారు. తొలి స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన చిత్రాన్ని గీసిన తన కూతురు... మీకు హిస్టరీకి సంబంధించిన కొన్ని బేసిక్స్ ను తన డ్రాయింగ్ ద్వారా గుర్తు చేయాలనుకుంటోందని ఎద్దేవా చేశారు. 

దీనిని కాంగ్రెస్ పార్టీ రీట్వీట్ చేస్తూ, ''మమతా బెనర్జీకి చరిత్ర పాఠాన్ని ఓ చిన్నారి బోధించింది. ఎందుకంటే, తమ రాజకీయ గురువులను సంతృప్తిపరచడం కోసం తొలి ప్రధాని నెహ్రూ ఫోటోను ట్విట్టర్ డీపీ నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించారు" అంటూ పేర్కొంది.  

More Telugu News