జమ్మూ కశ్మీర్ లో నదిలో బస్సు బోల్తా.. ఆరుగురు జవాన్ల మృతి

16-08-2022 Tue 14:42
  • అమర్ నాథ్ యాత్ర విధుల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
  • బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతోనే ప్రమాదం జరిగిందని ఐటీబీపీ ఉన్నతాధికారుల వెల్లడి
  • ప్రమాద ఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Bus carrying 39 security force personnel falls into riverbed in jammu and kashmir
జమ్మూ కశ్మీర్ లో 39 మంది ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించగా.. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

అమర్ నాథ్ యాత్ర విధుల నుంచి వస్తూ..
అమర్ నాథ్ యాత్ర కోసం భద్రతను పర్యవేక్షించిన 37 మంది ఐటీబీపీ జవాన్లు, ఇద్దరు జమ్మూ కశ్మీర్ సివిల్ పోలీసులు.. తమ విధులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా పహల్ గాం సమీపంలో బస్సు నదిలో బోల్తా పడింది. ఆ ప్రాంతంలో లోతుగా ఉండటంతో బస్సు మొత్తం నుజ్జునుజ్జయింది. అప్పటికప్పుడు 19 అంబులెన్సులను ఘటనా స్థలానికి రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అనంత్ నాగ్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయిర్ అంబులెన్సులలో శ్రీనగర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతోనే అదుపు తప్పి నదిలో పడిపోయినట్టు ఐటీబీపీ ఉన్నతాధికారులు, కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు.

ఆ జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా: అమిత్ షా
బస్సు బోల్తా ఘటన, ఐటీబీపీ జవాన్ల మృతి ఘటన విని దిగ్భ్రాంతికి గురయ్యానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి తగిన చికిత్స అందించాలని అధికారవర్గాలను మంత్రి ఆదేశించారు.