Science: సింహంతో పోలిస్తే పదిరెట్లు బలం.. టీ-రెక్స్‌ డైనోసార్‌ బలం గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు

  • కళ్లు చిన్నగా ఉండటం గట్టిగా కరవడానికి తోడ్పడిందని గుర్తింపు
  • పుర్రెలో కళ్ల ఆకృతిని మార్చుకోవడంతోనూ ప్రయోజనం
  • ఇలాంటి మార్పులతో టీ-రెక్స్‌ లు డైనోసార్లలో రారాజుల్లా వెలిగాయన్న శాస్త్రవేత్తలు
Scientists say that the secret of the T Rex dinosaurs strength is its small eyes

ఒకప్పుడు డైనోసార్లు భూమండలాన్ని అప్రతిహతంగా ఏలాయి. భీకర ఆకారాలతో మిగతా అన్ని జంతు జాతుల మీద ఆధిపత్యం చెలాయించాయి. వాటన్నింటిలో టైరనోసారస్‌ రెక్స్‌ (టీ-రెక్స్‌) అత్యంత భయానకమైనదని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. టీ-రెక్స్‌ డైనోసార్ల శిలాజాలను నిశితంగా పరిశీలించి.. దాని బలం అసామాన్యమని, ఒక్కసారి దాడి చేసిందంటే ఏ జీవి అయినా ఖతం కావాల్సిందేనని తేల్చారు.

ఉదాహరణకు ఒక సింహం తన నోటితో కొరికేసే బలం గరిష్ఠంగా 4,500 న్యూటన్లు అయితే.. ఎదిగిన టీ-రెక్స్‌ నోటితో కొరికేసే బలం 50,000 న్యూటన్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. టీ-రెక్స్‌ దాడి చేసి కొరికితే.. జంతువుల పుర్రెలు కూడా అప్పటికప్పుడే పగిలిపోయేవని గుర్తించారు. మరి అంత బలంగా కొరికినప్పుడు టీ-రెక్స్‌ పుర్రెలోని ఎముకలు కూడా కదిలి దెబ్బతినాలి కదా అని శాస్త్రవేత్తలకు అనుమానం వచ్చింది. అదేమిటో తేల్చేందుకు విస్తృత పరిశోధన చేశారు.

చిన్న చేతులు.. చిన్న కళ్లు..

  • టీ-రెక్స్‌ డైనోసార్లకు చెందిన 410 శిలాజాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆ సమయంలో ఓ చిత్రమైన విషయాన్ని గుర్తించారు. మిగతా డైనోసార్లతో పోలిస్తే టీ-రెక్స్‌ ల కళ్లు చిన్నవిగా ఉండటాన్ని పరిశీలించారు. ఇదే సమయంలో ప్రస్తుతమున్న బలమైన జంతువులను పోల్చి చూశారు.
  • పుర్రె భాగంలో కళ్లు, ముక్కు, చెవుల వంటి రంధ్రాలు చిన్నగా ఉన్న జీవుల్లో.. దవడల సామర్థ్యం, కొరికే బలం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. ముఖ్యంగా కళ్ల కోసం పుర్రెలో ఏర్పడే రంధ్రాలు చిన్నగా ఉండటం వల్ల దవడ పరిమాణం, దృఢత్వం పెరిగాయని.. అవి దేనినైనా కొరికేటప్పుడు పుర్రెపై పడే ఒత్తిడి బాగా తగ్గిపోయిందని గుర్తించారు.
  • ఈ క్రమంలోనే టీ-రెక్స్‌ డైనోసార్లు పరిణామ క్రమంలో తమ కళ్ల పరిమాణాన్ని తగ్గించుకుని.. బలాన్ని అసాధారణంగా పెంచుకున్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన స్కాట్లాండ్‌ నేషనల్‌ మ్యూజియం పురాతత్వ జీవశాస్త్రవేత్త స్టిగ్‌ వాల్ష్‌ వెల్లడించారు.
  • అంతేగాకుండా పుర్రెలో కళ్లకు ఉండే రంధ్రాలు గుండ్రంగా కాకుండా కీహోల్‌ (తాళం రంధ్రం) తరహాలో అభివృద్ధి చెందాయని.. గట్టిగా కొరికినప్పుడు ఏర్పడే ఒత్తిడిని తగ్గించడానికి ఇది వీలు కల్పించిందని వివరించారు.
  • దీనితోపాటు టీ-రెక్స్‌ డైనోసార్లు ఇతర డైనోసార్లు, జంతువులకు చిక్కకుండా ఉండేందుకు తమ చేతుల (ముందటి కాళ్లు/చేతులు) పరిమాణాన్ని కూడా తగ్గించుకున్నాయని తెలిపారు. ఇలాంటి మార్పులతో టీ-రెక్స్‌ లు డైనోసార్ల ప్రపంచంలో రారాజుల్లా నిలిచాయన్నారు.

More Telugu News