చరణ్ - శంకర్ సినిమాలో మరో బాలీవుడ్ భామ!

16-08-2022 Tue 10:17 | Entertainment
  • షూటింగు దశలో శంకర్ సినిమా 
  • చరణ్ సరసన నాయికగా కియారా 
  • కీలకమైన పాత్రలో హుమా ఖురేషి 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
Huma Qureshi in Shankar Movie
చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని అలరించనుంది. చరణ్ జోడీగా ఆమె కనిపించనుండటం ఇది రెండోసారి. 

ఈ సినిమాకు మరో బాలీవుడ్ భామను ఎంపిక చేశారనేది తాజా సమాచారం .. ఆమెనే హుమా ఖురేషి. ఈ సినిమాలో ఒక కీలకమైన .. పవర్ఫుల్ పాత్రకి గాను ఆమెను తీసుకున్నారని అంటున్నారు. ఒక రాజకీయనాయకురాలి పాత్రలో ఆమె కనిపించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఆమె పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.  

బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ హుమా ఖురేషి కి ఉంది. అలాగే తమిళనాట కూడా ఆమెకి మంచి గుర్తింపు ఉంది. రజనీ 'కాలా' ..  అజిత్ 'వలిమై' సినిమాలతో అక్కడ ఆమె పాప్యులర్ అయింది. చరణ్ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.