జగదీశ్ రెడ్డి నేర చరిత్రను బయటపెడతా.. నా దగ్గర రుజువులు ఉన్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • జగదీశ్ రెడ్డి అక్రమాస్తుల చిట్టాను బయటపెడతానన్న రాజగోపాల్ 
  • 2009 తర్వాత నేను ఆస్తులను అమ్ముకున్నానని వెల్లడి 
  • అమ్ముడుపోయానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ 
Jagadish Reddy gone to jail in a murder case says Komatireddy Raj Gopal Reddy

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డి నేర చరిత్రను, బినామీల పేరుతో ఆయన సంపాదించిన వేల కోట్ల అక్రమాస్తుల చిట్టాను బయటపెడతానని అన్నారు. గతంలో ఒక హత్య కేసులో జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర జగదీశ్ రెడ్డిదని చెప్పారు. దీనికి సంబంధించిన రుజువులు కూడా తన వద్ద ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు జగదీశ్ రెడ్డికి ఉన్న ఆస్తులెన్ని? ఇప్పుడున్న ఆస్తులెన్ని? అని ప్రశ్నించారు. 

2009 తర్వాత తన ఆస్తులను తాను అమ్ముకున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టుల కోసం తాను అమ్ముడుపోయానని జగదీశ్ రెడ్డి ఆరోపిస్తున్నారని... ఆయన వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే... మునుగోడు ఉప ఎన్నికలో తాను పోటీ చేయనని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. జగదీశ్ రెడ్డి నేర చరిత్ర, అక్రమాస్తులను తాను రుజువు చేస్తే... ఆయన రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

More Telugu News