అల్లు అర్జున్ అంటే ఇష్టం: అనన్య పాండే

15-08-2022 Mon 17:55
  • ఈ నెల 25న రిలీజ్ అవుతున్న 'లైగర్'
  • విజయ్ దేవరకొండ జోడీగా అనన్య పాండే 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న జంట  
  • అల్లు అర్జున్ డాన్స్ సూపర్ అంటున్న అనన్య 
Liger movie update
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'లైగర్' ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నాయికగా అనన్య పాండే అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు మూవీ. ఈ సినిమాకి సంబంధించి నిన్న వరంగల్ లో జరిగిన ఈవెంట్ లో ఆమె తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది.

తనకి తెలుగు నేర్పించింది విజయ్ దేవరకొండ అని ఆమె చెప్పడం .. బట్టీపట్టినట్టుగా మాట్లాడటం అందరికీ నచ్చింది. ఇక తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో 'మీకు ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరు?' అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ, తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమనీ  .. ఆయన డాన్స్ తనని ఆశ్చర్యపరుస్తూ ఉంటుందని చెప్పింది. 

అల్లు అర్జున్ చేసిన సినిమాల్లో 'అల వైకుంఠపురములో' చూశాననీ, ఆయన యాక్టింగ్ కి కూడా తాను ఫిదా అయ్యానని అంది. చూస్తుంటే బన్నీ జోడీ కట్టేయాలనే గట్టి పట్టుదలతోనే ఈ అమ్మడు ఉన్నట్టుగా కనిపిస్తోంది. 'లైగర్' హిట్ కొడితే ఈ నాజూకు భామ ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.