Droupadi Murmu: మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu speech ahead of Independence Day
  • రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • నేడు స్మృతి దివస్
  • జాతినుద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము
  • త్రివర్ణ పతాకం దేశం నలుమూలలా రెపరెపలాడుతోందని వెల్లడి
  • అమర జవాన్లను, మహనీయులను స్మరించుకోవాలని పిలుపు
రేపు (ఆగస్టు 15) భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలను పూర్తిచేసుకుంటోందని తెలిపారు. ఆగస్టు 14న స్మృతి దివస్ జరుపుకుంటున్నామని వెల్లడించారు. దేశ ప్రజలు ఉత్సాహభరితంగా స్వాతంత్ర్య ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, దేశం నలుమూలలా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అమర జవాన్లను స్మరించుకోవాల్సి ఉందని అన్నారు. అమర జవాన్ల త్యాగాల వల్లే స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు.

విదేశీ శృంఖలాలను ఛేదించుకుని స్వాతంత్ర్యం సాధించుకున్నామని, ఎందరో మహనీయులు ఆధునిక భారత్ నిర్మాణానికి కంకణబద్ధులు అయ్యారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహనీయులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. 

2021 మార్చి నుంచి అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని తెలిపారు. కరోనా సమయంలో యావత్ ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొందని, విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదురొడ్డి నిలిచామని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్టార్టప్ సంస్థల ఏర్పాటుతో అభివృద్ధిలో దూసుకెళుతున్నామని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విధానం పెనుమార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

ఇతర దేశాల్లో ఓటు హక్కు కోసం మహిళలు సుదీర్ఘకాలం పాటు పోరాడారని, ఇతర దేశాలతో పోల్చితే ప్రజాస్వామ్య సామర్థ్యం వెలికితీయడంలో భారత్ సత్తా చాటిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు. మన కుమార్తెలు దేశానికి అతిపెద్ద ఆశాకిరణాలు అని అభివర్ణించారు. భారతదేశం అనేక రకాల వైవిధ్యంతో నిండి ఉందని తెలిపారు. మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుందని, ఆ అంశమే మనందరినీ ఒకటిగా కలుపుతుందని అన్నారు. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో కలిసి నడవడానికి ప్రేరేపిస్తుందని తెలిపారు.
Droupadi Murmu
Speech
Independence Day
President Of India
India

More Telugu News