‘హెల్యూజనేషన్’.. ఊహాలోకంలో తేలిపోతున్న ఎలుగుబంటి! ‘మ్యాడ్‌ హనీ’ ఎఫెక్ట్.. వీడియో ఇదిగో..

14-08-2022 Sun 16:02
  • ప్రపంచంలో హిమాలయాలు, టర్కీలోని కాక్కర్ పర్వతాల్లో మాత్రమే లభించే చిత్రమైన తేనె
  • రోడోడెండ్రాన్ పూలలోని ఓ న్యూరో ట్యాక్సిన్ వల్లే ‘హెల్యూజనేషన్స్’
  • తేనెటీగలు ఆ పూల నుంచి తేనె సేకరించడంతో ‘మ్యాడ్ హనీ’ తయారు
Hallucinations A bear floating in imagination with Mad Honey effect Here is the video
హల్యూజనేషన్.. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఆర్య-2 సినిమాలోని సీన్లతో బాగా పాపులర్ అయిన డైలాగ్. బాగా మంచోడిలా కనిపించే అల్లు అర్జున్‌ తనతో తప్పుగా బిహేవ్‌ చేశాడని హీరోయిన్‌ చెబుతుంది. నో.. వే.. అంతా నీ హల్యూజనేషన్‌ అంటూ బ్రహ్మానందం బదులిస్తుంటాడు. ఈ సీన్‌ చాలా మందిని ఆకట్టుకుంది. లేనిది ఉన్నట్టుగా.. ఎక్కడో ఉన్నట్టుగా.. ఊహల లోకంలో తేలిపోవడమే హల్యూజనేషన్‌. పాపం ఈ చిత్రంలోని ఎలుగు బంటి కూడా అలానే హల్యూజనేషన్‌ లోకి వెళ్లిపోయింది. బాగా మద్యం తాగిన వ్యక్తిగా ఏదోలా బిహేవ్‌ చేస్తోంది. మరి దీనికి కారణం ఏమిటో తెలుసా.. తేనె. మామూలు తేనె కాదు. ఏకంగా గంజాయి, డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఇచ్చే మత్తు కలిగించే.. ‘మ్యాడ్‌ హనీ’ తేనె.

‘మ్యాడ్ హనీ’ ఎక్కువగా తినేసి..
టర్కీలోని డూజ్సీ ప్రావిన్స్ లోని అటవీ ప్రాంతంలో ఓ ఎలుగు బంటి పిల్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. సాధారణంగా మనుషులను చూస్తే ఎలుగు బంట్లు పారిపోతాయి, లేదా దాడి చేస్తాయి. కానీ ఈ ఎలుగు బంటి బాగా తాగేసినవారిలా అటూ ఇటూ పొర్లుతూ చిత్రంగా గొణుగుతూ ఉండిపోయింది. దాన్ని పరిశీలించిన స్థానికులు అది ‘మ్యాడ్ హనీ’ తిని ఉంటుందని గుర్తించారు. దీనిపై అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి ఎలుగు బంటిని మినీ ట్రక్ లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మినీ ట్రక్ లోకి ఎక్కించినప్పుడు కూడా సదరు ఎలుగు బంటి తీరు చూసి అంతా ఆశ్చర్యపోయారు.

ఏమిటీ ‘మ్యాడ్ హనీ’?
  • సాధారణంగా తేనెటీగలు పూల నుంచి తేనెను పీల్చుకుని తేనెపట్టుల్లో నిల్వ చేసుకుంటాయి. ఈ క్రమంలో రోడోడెండ్రాన్ పూల నుంచి కూడా తేనెను సేకరిస్తుంటాయి. ఈ పూలలోని తేనెలో గ్రయనోటాక్సిన్ అనే ఒక రకమైన న్యూరోటాక్సిన్ (నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే విషపూరిత పదార్థం) ఉంటుంది.
  • తేనెటీగలు ఇలాంటి రోడోడెండ్రాన్ పూల నుంచి ఎక్కువగా తేనెను తెచ్చి పట్టులోని తేనెలో కలిపితే.. ‘మ్యాడ్ హనీ’ తయారవుతుంది.
  • ఈ రకం తేనె హిమాలయ పర్వతాల్లో మాత్రమే లభిస్తుంటుంది. ప్రపంచంలో దాని తర్వాత మ్యాడ్ హనీ లభించే ఒకే ఒక్క ప్రాంతం టర్కీలోని కాక్కర్ పర్వతాలు. ప్రస్తుతం ఎలుగుబంటి మ్యాడ్ హనీని తిన్నది ఈ ప్రాంతంలోనే. 
  • ఈ తేనెను ఒక చెంచాడు తిన్నా కూడా ఒక రకమైన మత్తుతో కూడిన ఊహాలోకంలోకి తీసుకెళ్తుంది. దీనిని డిప్రెషన్, హైపర్ టెన్షన్ వంటి మానసిక సమస్యలకు మందుగా ఉపయోగిస్తుంటారు.
  • అయితే ఈ తేనె ఎక్కువగా తినడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు బాగా పడిపోవడం, వికారం, తల తిరగడం, స్పృహ తప్పిపోవడం, వణుకులు వంటి సమస్యలు వస్తాయని.. ఒక్కోసారి మరణించే అవకాశమూ ఉంటుందని వివరిస్తున్నారు. 
  • మ్యాడ్ హనీని టర్కీలో ‘దెలీ బాల్’ అని పిలుస్తుంటారు. ఏటా చాలా మంది ఈ తేనె ప్రభావం కారణంగా ఆస్పత్రుల్లో చేరుతుంటారని చెబుతున్నారు.