ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా మృతి పట్ల ప్రధాని మోదీ, చంద్రబాబు స్పందన

14-08-2022 Sun 14:20
  • రాకేశ్ ఝున్ ఝున్ వాలా హఠాన్మరణం
  • తీవ్ర విచారంలో స్టాక్ మార్కెట్ వర్గాలు
  • సంతాపం తెలిపిన మోదీ, చంద్రబాబు
  • తిరుగులేని ఇన్వెస్టర్ అంటూ కితాబు
Modi and Chandrababu condolences to the demise of Rakesh Jhunjhunwala
దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా (62) హఠాన్మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రాకేశ్ ఝున్ ఝున్ వాలా మృతి బాధాకరమని పేర్కొన్నారు. తిరుగులేని రీతిలో ప్రస్థానం కొనసాగించాడని కొనియాడారు. ఆయన జీవితాన్ని పరికిస్తే చమత్కారభరితంగా, లోతైన దృష్టితో వ్యవహరించిన వైనం కనిపిస్తుందని అభివర్ణించారు. తన విశేష భాగస్వామ్యంతో ఆర్థిక ప్రపంచంపై చెరగని ముద్ర వేశారని మోదీ కీర్తించారు. భారతదేశ అభివృద్ధి పట్ల ఎంతో తపించిన వ్యక్తిగా రాకేశ్ ఝున్ ఝున్ వాలా నిలిచిపోతారని వివరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. 

అటు, ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా రాకేశ్ ఝున్ ఝున్ వాలా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. రాకేశ్ ఝున్ ఝున్ వాలా మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఎంతో అనుభవమున్న ఇన్వెస్టర్, పారిశ్రామికవేత్తగా భారత పెట్టుబడిదారీ విపణిలో ఆయన భాగస్వామ్యం అపారమైనదని కీర్తించారు. దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ గా ఘనమైన వారసత్వాన్ని అందించారని కొనియాడారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు సంతాపం తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.