కలిసి బతుకుదామని చెప్పి.. కాసేపటికే కోర్టులోనే భార్య గొంతు కోసిన భర్త!

14-08-2022 Sun 13:31
  • కర్ణాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టులో దారుణం
  • పెళ్లయిన ఏడేళ్ల తర్వాత విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన జంట
  • అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో కలిసి ఉండేందుకు అంగీకరించిన భర్త
Man slits wifes throat at family court in karnataka
ఇద్దరూ భార్యాభర్తలు.. ఏడేళ్ల కింద వివాహమైంది. కానీ ఏవో విభేదాలతో కోర్టు మెట్లెక్కారు. కౌన్సెలింగ్ లో నచ్చజెబితే కలిసి ఉంటామన్నారు. కౌన్సెలింగ్ హాల్ నుంచి బయటికి వచ్చిన కాసేపటికే భర్త ఓ కత్తి తీసుకుని భార్య గొంతు కోసి చంపేశాడు. కర్ణాటకలోని హాసన్ జిల్లా హలెనరసిపుర ఫ్యామిలీ కోర్టు ఆవరణలో ఈ ఘటన జరిగింది.

కలిసి ఉండేందుకు సిద్ధమని..
హసన్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌, చైత్ర అనే మహిళకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంతకాలం నుంచి వేరుగా ఉంటున్నారు. ఇటీవల ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కోర్టు అధికారులు వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. విభేదాలను పరిష్కరించుకుని, కలిసి జీవించాల్సిందిగా సూచించారు. కౌన్సెలింగ్ సెషన్ లో అందుకు ఇద్దరూ అంగీకరించారు. కలిసి ఉంటామని ఇద్దరూ అధికారులకు చెప్పారు.

బాత్రూం కోసమని వెళుతుంటే..
కోర్టులోని కౌన్సెలింగ్ గది నుంచి బయటికి వచ్చాక  కాసేపు ఆవరణలో నిలబడ్డారు. చైత్ర బాత్రూం కోసం వెళుతుండగా.. శివకుమార్ ఒక్కసారిగా ఆమె వైపు దూసుకెళ్లాడు. అప్పటికే వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో చైత్ర గొంతు కోసేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగానే పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడ ఉన్న కొందరు శివకుమార్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
  • రక్తపు మడుగులో పడిపోయిన చైత్రను బంధువులు, అక్కడున్నవారు ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ కొంత సేపటికే చనిపోయింది.
  • శివకుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. అసలు కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శివకుమార్ కోర్టు కాంప్లెక్స్ లోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడన్న దానిపై విచారణ చేస్తున్నామన్నారు.