భక్తులతో తిరుమల కిటకిట.. ఆరు కిలోమీటర్ల మేర క్యూ

14-08-2022 Sun 13:03
  • సేవాసదన్ దాటి రింగురోడ్డు వరకు బారులు తీరిన భక్తులు
  • దర్శనానికి 48 గంటలకు పైగా సమయం
  • శనివారం ఒక్కరోజే 83వేల మంది భక్తులకు దర్శనం
tirumala piligrims crowd
వరుస సెలవు రోజులు రావడంతో తిరుమల సప్త గిరులు భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. శనివారం ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొనగా.. ఆదివారం ఉదయానికి భక్తుల సంఖ్య మరింత పెరిగింది. సెలవు దినాల్లో శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామి వారి దర్శనానికి చాలా సమయం తీసుకుంటోంది. 

శనివారం ఒక్క రోజే 83వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారంటే రద్ధీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వామివారి సర్వ దర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. సర్వ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సుమారు 6 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. సేవాసదన్ దాటి రింగురోడ్డు వరకు భక్తుల క్యూ పెరిగిపోయింది.