ఆస్కార్ అవార్డు నామినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్?

14-08-2022 Sun 12:20
  • వెరైటీ మ్యాగజైన్ అంచనా
  • ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు
  • ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రకు మరోసారి గుర్తింపు
 RRR actor Jr NTR in Oscar nominations
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంతోషం కలిగించే వార్త ఇది. ఆస్కార్ అవార్డు నామినేషన్లలో ఈ విడత జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఉండొచ్చని హాలీవుడ్ కు చెందిన ‘వెరైటీ మ్యాగజైన్’ అంచనా వేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించడం తెలిసిందే. ఈ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటన అందరినీ మెప్పించే విధంగా ఉంటుంది. 

ఇప్పుడు ఇదే పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ను ఉత్తమ నటుడి అవార్డు నామినేషన్లలోకి తీసుకోవచ్చని వెరైటీ మ్యాగజైన్ అంచనా వేస్తోంది. ‘ఆల్ కంటెండర్స్ లిస్ట్’లో ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరును పొందుపరిచింది.  ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించడంతోపాటు, భారీ వసూళ్లను తెచ్చిపెట్టడం తెలిసిందే. రాజమౌళి తీసిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రల్లో నటించారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దీనిపై సామాజిక మాధ్యమాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.