యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు.. కేసు నమోదు 

14-08-2022 Sun 11:09
  • బాంబు పెట్టి చంపేస్తానంటూ లేఖ
  • భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడికి లేఖ పంపిన నిందితుడు
  • ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
UP CM Yogi PIL activist receive death threat police files case
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ కిసాన్ మంచ్ (బీకేఎం) జాతీయ అధ్యక్షుడు, ప్రజాహిత వ్యాజ్యాలతో పోరాడే కార్యకర్త దేవేంద్ర తివారీని బెదిరించిన సల్మాన్ సిద్ధిఖి అనే వ్యక్తిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సిద్ధిఖి బెదిరింపు లేఖను లక్నోలోని తివారీ ఇంటికి పంపాడు. ‘నిన్ను, సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బాంబు పెట్టి చంపేస్తా’నంటూ లేఖలో ఉంది. 

యూపీలో కబేళాల మూసివేతకు, అతడి బెదిరింపు లేఖకు సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ లేఖ విషయమై తివారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గతంలోనూ పలు సందర్భాల్లో బెదిరింపులు వచ్చాయి.