రొంపిచర్లలో వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై హత్య

14-08-2022 Sun 09:37
  • విప్పర్లలో ఆరుబయట నిద్రించిన వృద్ధురాలు
  • సమీపంలోనే ఉండే వ్యక్తి ఇంట్లోకి వెళ్లిన జాగిలాలు
  • నేరాన్ని అంగీకరించిన యువకుడు
Youth Raped old woman and killed in Rompicherla
పల్నాడు జిల్లా రొంపిచర్లలో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన నిందితుడు అనంతరం ఆమెను హత్య చేశాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని విప్పర్లకు చెందిన వృద్ధురాలు రోజులానే శుక్రవారం రాత్రి ఇంటిముందు ఆరుబయట నిద్రించింది. శనివారం ఉదయం పొద్దెక్కినా లేవకపోవడంతో వెళ్లి లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శరీరంపై గాయాలు ఉండడంతోపాటు దుస్తులు తొలగించి ఉండడంతో అత్యాచారం చేసి హత్య జరిగినట్టు అనుమానించారు. డాగ్‌స్క్వాడ్‌తో గాలించారు. శునకాలు అక్కడికి సమీపంలోనే ఉన్న పెరవలి మణికంఠ (27) ఇంట్లోకి వెళ్లడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తానే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.