బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న జీవితా రాజశేఖర్

13-08-2022 Sat 20:50
  • మోదీ దేశాన్ని కాపాడతారన్న జీవిత
  • మోదీపై నమ్మకంతోనే బీజేపీలో చేరినట్టు వెల్లడి
  • బండి సంజయ్ సమర్థుడైన నేత అని కితాబు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుందని వెల్లడి
Jeevitha participates in Bandi Sanjay Padayatra
సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆమె ఇవాళ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో కలిసి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర నేడు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోకి ప్రవేశించింది. పొడిచేడు వద్ద తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి జీవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని విమర్శనాత్మకంగా స్పందించారు. 

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ్నించైనా బరిలో దిగుతానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దేశానికి ఓ భరోసా అని, ఆయనను నమ్మి బీజేపీలో చేరినట్టు జీవిత వెల్లడించారు. 

ఇకమీదట పార్టీ పరమైన అన్ని కార్యక్రమాలకు హాజరవుతానని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నట్టు తెలిపారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఇద్దరు ఆడపిల్లల తల్లిగా మహిళల కష్టాలు తనకు తెలుసని అన్నారు.