విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం

13-08-2022 Sat 20:20
  • రాజాంలో ఘటన
  • గోడ పగులగొడుతుండగా లాకర్ గుర్తింపు
  • గుప్తనిధి ఉండొచ్చని అంచనా
  • యజమాని నుంచి దాచేందుకు కూలీల విఫలయత్నం
  • రంగప్రవేశం చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు
Iron Locker found in a old house in Vijayanagaram district
విజయనగరం జిల్లా రాజాంలో కంచర వీధిలో ఓ పురాతన ఇంటిని కూల్చుతుండగా, అందులో ఓ గోడ నుంచి ఓ ఇనుప లాకర్ బయటపడింది. బాగా బరువుగా ఉన్న ఆ లాకర్ లో గుప్తనిధి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే లాకర్ బయటపడిన సమయంలో ఇంటి యజమాని అక్కడ లేరు. దాంతో, ఆ యజమానికి లాకర్ విషయం తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచేందుకు కూలీలు ప్రయత్నించారు. 

అయితే, ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకిపోయి యజమానికి తెలియడంతో, ఆయన ఆ లాకర్ తనదేనంటూ స్పష్టం చేశారు. మరోవైపు కూలీలు ఆ లాకర్ తమదేనంటూ, దాన్ని యజమానికి ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. ఈ వ్యవహారాన్ని స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన అధికారులు విచారణ జరుపుతున్నారు. లాకర్ ఇంకా తెరవలేదని ఆ ఇంటి యజమాని వెల్లడించారు.