ఎంపీ మాధవ్ వీడియోను అమెరికా పంపామంటున్నారు... వీళ్లకసలు సిగ్గు, శరం ఉన్నాయా?: టీడీపీ నేతలపై కొడాలి నాని ఫైర్

13-08-2022 Sat 19:28
  • ఫేక్ వీడియో తయారు చేశారని నాని ఆరోపణ
  • చంద్రబాబుకు ఇదేం కొత్త కాదని వ్యాఖ్యలు
  • చంద్రబాబు మాటలు ల్యాబ్ కు పంపాల్సిందని వెల్లడి
Kodali Nani fires on TDP leaders
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టుకు పంపామని, అందులో ఉన్నది మాధవ్ అని తేలిందని టీడీపీ నేతలు చెబుతుండడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో స్పందించారు. ఎంపీ మాధవ్ వీడియోను అమెరికా ల్యాబ్ కు పంపామని టీడీపీ నేతలు చెబుతున్నారని, అది ఒరిజినల్ అని ఆ ల్యాబ్ వారు చెప్పినట్టు టీడీపీ నేతలు అంటున్నారని, వీళ్లకసలు ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నాయా అన్నది ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. 

ఫేక్ వీడియోను తయారుచేసిన ఫోర్ ట్వంటీ చంద్రబాబుకు ఇలాంటి దొంగ సర్టిఫికెట్లు తేవడం కొత్తకాదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా మాట్లాడిన మాటలను అమెరికా ల్యాబ్ కు ఎందుకు పంపలేదని కొడాలి నాని ప్రశ్నించారు. 'మనవాళ్లు బ్రీఫ్డ్ మీ' అని మాట్లాడిన చంద్రబాబు మాటలు ఆయన మాటలో కాదో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ పార్టీ అని అభివర్ణించారు. దాన్ని టీడీపీ అని కాకుండా టీఎల్పీ (తెలుగు లింగ పరిశోధన పార్టీ) అని చెప్పాలని, దానికి చంద్రబాబు అధ్యక్షుడు అని ఎద్దేవా చేశారు.