'పార్టీ నేతలంతా నన్ను వాడుకుని వదిలేశారంటూ' యాడికి నుంచి అమరావతికి వైసీపీ కార్యకర్త పాదయాత్ర

13-08-2022 Sat 19:27
  • అనంత‌పురం జిల్లా యాడికి మండ‌లానికి చెందిన సుద‌ర్శ‌న్ రెడ్డి
  • వైసీపీని న‌మ్ముకుని ఆస్తినంతా అమ్ముకున్నాన‌ని వెల్లడి  
  • జ‌గ‌న్‌ను క‌లిసి త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తాన‌ని  వ్యాఖ్య 
ysrcp member says that party leaders deceived him
ఏపీలో అధికార పార్టీ వైసీపీని నమ్ముకుని స‌ర్వ‌స్వం కోల్పోయాన‌ని ఆ పార్టీకి చెందిన ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీకి చెందిన నేత‌లంతా త‌న‌ను వాడుకుని వ‌దిలేశార‌ని ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు. ఈ మేర‌కు అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌కవ‌ర్గంలోని యాడికి మండ‌లానికి చెందిన వైసీపీ కార్య‌క‌ర్త సుద‌ర్శ‌న్ రెడ్డి శ‌నివారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీని న‌మ్ముకుని త‌న‌కు ఉన్న ఆస్తినంతా అమ్ముకున్నాన‌ని సుద‌ర్శ‌న్ రెడ్డి వాపోయారు. ఇదే విష‌యాన్ని పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలియ‌జేస్తాన‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్రమంలో ఆయన యాడికి నుంచి అమరావ‌తికి పాద‌యాత్ర మొద‌లుపెట్టారు. తాడేప‌ల్లిలో జ‌గ‌న్‌ను క‌లిసి పార్టీలో కింది స్థాయి కార్య‌క‌ర్త‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను తెలియ‌జేస్తాన‌ని సుద‌ర్శ‌న్ రెడ్డి వెల్ల‌డించారు.