హాదీ మతార్... సల్మాన్ రష్దీపై దాడి చేసింది ఇతడే!

13-08-2022 Sat 18:39
  • సల్మాన్ రష్దీకి కత్తిపోట్లు
  • న్యూయార్క్ లో ఘటన
  • హాదీ మతార్ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఇరాన్ భావజాలం పట్ల సానుభూతిపరుడిగా గుర్తింపు
Police identifies Salman Rushdie attacker as Hadi Matar
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఇప్పుడు విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనపై నిన్న న్యూయార్క్ నగరంలో దాడి జరిగింది. చౌటాక్వా వద్ద ఓ సదస్సుకు హాజరైన రష్దీపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రష్దీపై దాడి చేసిన ఆ యువకుడు ఎవరు? ఎందుకు కత్తితో దాడి చేశాడు? అనే అంశాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఆ యువకుడి పేరు హాదీ మతార్. అతడి వయసు 24 ఏళ్లు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూ ప్రాంతంలో నివసిస్తుంటాడు. అయితే అతడు ఏ దేశానికి చెందినవాడన్నది ఇంకా తెలియరాలేదు.

అతడి ఫోన్ లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జీసీ) కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటో ఉండడాన్ని బట్టి, అతడు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కు సానుభూతిపరుడు అయ్యుంటాడని భావిస్తున్నారు. ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ గా పేరుగాంచిన ఖాసిమ్ సులేమానీ 2020లో హత్యకు గురయ్యాడు. 

పోలీసుల ప్రాథమిక విచారణలో హాదీ మతార్ కు ఏ గ్రూపుతోనూ సంబంధాలు లేవని గుర్తించారు. అయితే, షియా అతివాద ధోరణుల పట్ల ఆకర్షితుడై ఉంటాడని అతడి ఫేస్ బుక్ పోస్టులు చెబుతున్నాయి. సొంత సిద్ధాంతాలతో ఒంటరిగానే కార్యాచరణకు దిగి ఉంటాడని భావిస్తున్నారు. కాగా, రష్దీపై దాడి జరిగిన స్థలంలో పోలీసులు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వాటిని విశ్లేషించే పనిలో పడ్డారు.

80వ దశకంలో రష్దీ రాసిన 'ద శాటానిక్ వర్సెస్' పుస్తకం ఇరాన్ అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 1988లో ఆ పుస్తకాన్ని ఇరాన్ నిషేధించింది. రష్దీని చంపేయాలంటూ ఫత్వా కూడా జారీ అయింది. ఏమైనా ఇప్పుడు రష్దీపై హాదీ మతార్ దాడి చేసిన నేపథ్యంలో అతడిని ఇరాన్ లో హీరోగా కీర్తిస్తున్నారు.