ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయో గుర్తించిన నిపుణుల కమిటీ

13-08-2022 Sat 17:18
  • ఇటీవల ఎలక్ట్రిక్ బైకుల్లో అగ్ని ప్రమాదాలు
  • చార్జింగ్ పెడుతుండగా మంటలు
  • ప్రాణాలు కోల్పోయిన పలువురు వ్యక్తులు
  • నివేదిక రూపొందించిన నిపుణుల కమిటీ
Experts Committee identifies what caused to fire broke out in electric bikes
ఇటీవల కాలంలో దేశంలో పలు ఎలక్ట్రిక్ బైకులు అగ్నికి ఆహుతి కావడం తెలిసిందే. చార్జింగ్ పెడుతున్న సమయంలోనూ, ప్రయాణిస్తున్న సమయంలోనూ ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమైన ఘటనలు ఈ వేసవిలో చోటుచేసుకున్నాయి. పలువురు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని భావిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రమాదాలు జరగడంపై కేంద్రం దృష్టిసారించింది. ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు కాలిపోతున్నాయో తెలుసుకునేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 

తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం జరిపి ఓ నివేదిక రూపొందించింది. చాలా ప్రమాదాలు బ్యాటరీలో లోపాలు, షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగాయని కమిటీ గుర్తించింది. సెల్ఫ్ వెంటింగ్ మెకానిజంలో తీవ్రస్థాయి లోపాలు ఉన్న విషయాన్ని గమనించింది. అంతేకాదు, నాణ్యత లేని వాహనాలు విక్రయించాయంటూ మూడు కంపెనీలపై భారీ జరిమానా విధించాలని ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.