ప్రభుత్వ ఉద్యోగం నుంచి హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ చీఫ్ తనయుడి తొలగింపు

13-08-2022 Sat 16:54
  • రాష్ట్ర భద్రతకు భంగం కలిగించేలా చర్యలు
  • అప్రమత్తం చేసిన నిఘా సంస్థలు
  • కశ్మీర్ లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
Hizbul chief son lost his govt job
జమ్ము కశ్మీర్ ప్రభుత్వం తాజాగా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో ఉగ్రవాద ప్రముఖుల కుటుంబ సభ్యులు ఉండడం గమనార్హం. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ తనయుడు సయ్యద్ అబ్దుల్ ముయీద్, జేకేఎల్ఎఫ్ ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ అలియాస్ బిట్టా కరాటే భార్య అస్సబా ఉల్ అర్జామండ్ ఖాన్ ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. ఉగ్రవాద లింకులు ఉన్నాయన్న కారణంగా, ఆర్టికల్ 311 కల్పించిన విశిష్ట అధికారంతో వారిపై ఎలాంటి విచారణ లేకుండానే ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. 

డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ (డి కేటగిరీ సైంటిస్ట్-కశ్మీర్ యూనివర్సిటీ), మజీద్ హుస్సేన్ ఖాద్రీ (సీనియర్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్-కశ్మీర్ యూనివర్సిటీ), సయ్యద్ అబ్దుల్ ముయీద్ (ఐటీ మేనేజర్-జేకేఈడీఐ), అస్సబా ఉల్ అర్జామండ్ ఖాన్ (పబ్లిసిటీ విభాగం-డైరెక్టరేట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్) ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉద్యోగాలు కోల్పోయారు. వీరి కార్యకలాపాలు రాష్ట్ర భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని నిఘా సంస్థలు, లా ఎన్ ఫోర్స్ మెంట్ అందించిన సమాచారం మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.