సరిహద్దులో శాంతికి చైనా విఘాతం కలిగిస్తే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుంది: విదేశాంగ మంత్రి జై శంకర్

13-08-2022 Sat 12:53
  • ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణమైనవి కావన్న మంత్రి
  • సరిహద్దుల్లో అశాంతితో అవి మరింత క్లిష్టంగా మారతాయని వ్యాఖ్య
  • చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతపై తొలిసారి స్పందించిన భారత్
India China relation will be impacted if peace in border areas is disturbed says EAM Jaishankar
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు చైనా విఘాతం కలిగిస్తే భారత్‌-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. ఇరు దేశాల సంబంధం ఎప్పుడూ సాధారణమైనది కాదని, సరిహద్దుల్లో పరిస్థితి బాగా లేనంత వరకు ఇది ఇలానే ఉంటుందని చెప్పారు. రెండేళ్ల కిందట లడఖ్ లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత సరిహద్దుల్లో పరిస్థితి పెద్ద సమస్యగా మారిందన్నారు.  

అయితే, రెండేళ్లుగా భారత సైన్యం తన పట్టును కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు. ఇక, ఇరు పక్షాలు చాలా దగ్గరగా ఉన్న ప్రదేశాల నుంచి భద్రతా దళాలను ఉపసంహరించుకునే విషయంలో కొంత గణనీయమైన పురోగతి సాధించామ‌ని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు సేనలు చాలా దగ్గరగా ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని ఆయన అన్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి కూడా కావచ్చు కాబట్టి తామ చర్చలు జరుపుతున్నామని మంత్రి చెప్పారు. బెంగళూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఆ విధంగా చెప్పుకొచ్చారు. 

మరోవైపు, చైనా-తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతపై భారత్ తొలిసారి స్పందించింది. ఏ దేశం పేరును పేర్కొనకుండానే తాజా పరిణామాలపై ఆందోళన చెందుతున్నామని తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి కృషి చేస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని మార్చి, ఉద్రిక్తతలను తగ్గించడానికి సంయమనం పాటించాలని కోరుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఏకపక్ష చర్యలను నివారించాలని కోరుతున్నామన్నారు.