కృతి శెట్టికి టెన్షన్ మొదలైనట్టే!

13-08-2022 Sat 11:45
  • భారీ హిట్ తో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి
  • 'ది వారియర్' తో పడిన ఫస్టు ఫ్లాప్ 
  • నిరాశపరిచిన 'మాచర్ల నియోజకవర్గం'
  • ఆశలన్నీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' పైనే
Macharla Niyojakavargam movie update
కృతి శెట్టికి అందంతో పాటు అదృష్టం కూడా పుష్కలంగా ఉందని అంతా భావించారు. అందుకు కారణం ఫస్టు మూవీ అయిన 'ఉప్పెన' సంచలన విజయాన్ని సాధించడం .. ఆ తరువాత హ్యాట్రిక్ హిట్ ఆమె ఖాతాలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దాంతో కెరియర్ పరంగా ఈ మధ్య కాలంలో ఇంతలా దూసుకుపోయినవారెవరూ లేరంటూ గొప్పగా చెప్పుకున్నారు.

హ్యాట్రిక్ హిట్ పడేలోగానే కృతి శెట్టి మరో మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసింది. ఆ మూడు సినిమాల్లో ఒకటిగా మొన్నీమధ్య 'ది వారియర్' థియేటర్లకు వచ్చింది. రామ్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా పరాజయం పాలైంది. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆమెకి ఫస్టు ఫ్లాప్ ఇచ్చింది. ఇక ఆమె నితిన్ జోడీగా చేసిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తొలి ఆటతోనే ఈ సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. పాత్ర పరంగా కృతికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, కథాకథనాలు రోటీన్ గా ఉండటం వలన ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో కృతి శెట్టికి టెన్షన్ మొదలైనట్టే కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' పైనే ఉన్నాయి.