ఇక మాస్కులు ధరించక్కర్లేదంటున్న ఉత్తర కొరియా

13-08-2022 Sat 11:01
  • కరోనాపై విజయం సాధించినట్టు ఇటీవలే ప్రకటన  
  • తమ దేశంలో కరోనా వ్యాప్తికి దక్షిణ కొరియా కుట్ర చేసిందని ఆరోపణ
  • ఆ దేశ అధికారులను తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక  
North korea lifts mask mandate after Kim Jong declares covid victory
కరోనాపై పోరులో తమ దేశం విజయం సాధించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. దాంతో, దేశంలో మాస్కు తప్పనిసరి అన్న నిబంధనను ఆ దేశ అధికారులు ఎత్తి వేశారు. ఇతర ఆంక్షలను కూడా సడలించారు. మరోవైపు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ ఉత్తర ప్రాంతంలో కరోనా వ్యాప్తికి దక్షిణ కొరియా అధికారులే కారణమని ఉత్తరకొరియా ఆరోపించింది. అవసరమైతే దక్షిణ కొరియా అధికారులను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించిన తర్వాత కరోనా నిబంధనలు సడలిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. 

‘మన దేశంలో సృష్టించిన ప్రజారోగ్య సంక్షోభం నుంచి బయపడ్డాం. తక్కువ వ్యవధిలో ప్రాణాంతక వైరస్ ను నిర్వీర్యం చేసి మన భూభాగాన్ని శుభ్రంగా మార్చుకున్నాం. కాబట్టి వైరస్ పరిమితులు సడలించడం జరిగింది. దేశం మొత్తం అంటువ్యాధి రహిత జోన్‌గా మారినందున, ఫ్రంట్‌లైన్ ప్రాంతాలు, సరిహద్దు నగరాలు, కౌంటీలు మినహా అన్ని ప్రాంతాలలో తప్పనిసరిగా మాస్కు ధరించే దశను ఎత్తివేశారు’ అని ప్యాంగ్యాంగ్ అధికారిక కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) పేర్కొంది.  

మేలో తొలి దశ కేసులు నమోదైన కొన్ని నెలల్లోనే ఉత్తర కొరియా ఈ వారం ప్రారంభంలో కరోనాపై విజయం సాధించినట్టు ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాలు మినహా సామాజిక దూరం, ఇతర వైరస్ నిరోధక చర్యలను కూడా ఎత్తి వేసింది. కానీ శ్వాసకోశ వ్యాధి లక్షణాలతో ఉన్న వ్యక్తులు మాస్కులు ధరించాలని సిఫారసు చేసింది. అలాగే, ఉత్తర కొరియన్లు అసాధారణ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.