Gorantla Madhav: గోరంట్ల మాధవ్ వీడియోకు ఫోరెన్సిక్ టెస్ట్ చేయించి నిజం నిగ్గు తేల్చండి: అమిత్‌షాకు లేఖ రాసిన హైకోర్టు న్యాయవాది

  • అమిత్ షాకు, డీజీపీకి వేర్వేరుగా లేఖలు
  • రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
  • మహిళలపై నేరాల్లో వైసీపీ నాయకులు, మద్దతుదారుల ప్రమేయం ఉందన్న న్యాయవాది
  • అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కోరిన న్యాయవాది
AP High Court lawyer writes letter to Amit Shah about MP gorantla madhav

కలకలం రేపిన ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించి నిజం నిగ్గు తేల్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని లేఖలో పేర్కొన్న ఆయన.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో వైసీపీ నాయకులు, మద్దతుదారుల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వైసీపీ నేతల్ని కాపాడేందుకు ఓ వర్గం పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.

‘దిశ’ అనే ప్రత్యేక చట్టం లేకున్నా ఏపీ ప్రభుత్వం ఆ పేరుతో మహిళల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర హోం శాఖ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ చేసినట్టుగా ఉన్న వీడియో క్లిప్ ఫేక్ అని, మార్ఫింగ్ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడం మహిళలను విస్మయానికి గురిచేసిందన్నారు. జూన్ 2019 నుంచి జులై 2022 మధ్య రాష్ట్రంలో మహిళలపై 777 ఘటనలు నమోదయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 

నేరస్థుల్ని తప్పించడంలో వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, అధికారుల పాత్రపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు. అలాగే, డీజీపీకి మరో లేఖ రాస్తూ.. వీడియో క్లిప్‌పై విచారణ జరుగుతుండగానే వాస్తవాల్ని వక్రీకరించి వివరాలను వెల్లడించడం పోలీసుల ఎథిక్స్, స్టాండింగ్ ఆర్డర్లకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఎస్పీ ఫకీరప్ప కావాలనే ఇలా చేస్తున్నట్టుగా ఉందని, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ ఆ లేఖలో కోరారు.

More Telugu News