ఆమె చెర నుంచి నా కుమారుడిని రక్షించండి: హెచ్చార్సీని ఆశ్రయించిన తండ్రి

13-08-2022 Sat 08:04
  • ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి
  • జూన్ 26న ఇంటి నుంచి వెళ్లిపోయిన యువకుడు
  • స్థానికంగా ఉండే మహిళ ప్రేమ పేరుతో లోబర్చుకుందని ఆరోపణ
  • తిరిగి తమ చెంతకు చేర్చాలని విజ్ఞప్తి
Father approaches HRC to save his son from a woman
తన కుమారుడిని ఓ మహిళ వలలో వేసుకుందని, ఆమె చెర నుంచి అతడిని కాపాడాలంటూ ఓ తండ్రి హైదరాబాద్‌లో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలికి చెందిన ఫిర్యాదుదారు ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడు. 19 ఏళ్ల ఆయన కుమారుడు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. జూన్ 26న ఇంటి నుంచి వెళ్లిపోయిన యువకుడు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన హెచ్చార్సీని ఆశ్రయించారు. 

స్థానికంగా ఉండే ఓ మహిళ తన కుమారుడిని ప్రేమ పేరుతో లోబర్చుకుందని హెచ్చార్సీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆమె చెర నుంచి తన కుమారుడిని విడిపించి రక్షించాలని, కుమారుడిని తిరిగి తమ చెంతకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశామని అయితే, మేజర్ కాబట్టి తామేమీ చేయలేమన్నారని ఆయన వాపోయారు. అందుకనే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్టు చెప్పారు.