ఏపీపై ఫిర్యాదు చేస్తూ కేఆర్ఎంబీకి 2 లేఖ‌లు రాసిన తెలంగాణ ఈఎన్‌సీ

12-08-2022 Fri 20:03
  • అనుమ‌తులు లేని ప్రాజెక్టుల‌ను నిలిపివేయాల‌న్న ముర‌ళీధ‌ర్‌
  • గాలేరు- న‌గ‌రి నుంచి హంద్రీ- నీవాలోకి నీటిని ఎలా త‌ర‌లిస్తార‌ని ప్ర‌శ్న‌
  • అది కృష్ణా జ‌లాల అక్ర‌మ త‌ర‌లింపు కింద‌కే వ‌స్తుంద‌ని ఫిర్యాదు
telangana enc complait to krmd over andhra pradesh
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాల‌కు సంబంధించి శుక్ర‌వారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఏపీ నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తోంద‌ని ఆరోపిస్తూ కృష్ణా న‌దీ జ‌లాల యాజ‌మాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు తెలంగాణ నీటిపారుద‌ల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) ముర‌ళీధ‌ర్... కేఆర్ఎంబీ చైర్మ‌న్‌కు 2 లేఖ‌లు రాశారు. 

గాలేరు- న‌గ‌రి ప్రాజెక్టు నుంచి హంద్రీ- నీవా ప్రాజెక్టులోకి ఏపీ స‌ర్కారు నీటిని మ‌ళ్లిస్తోంద‌ని ముర‌ళీధ‌ర్ తన లేఖలో ఆరోపించారు. ఈ రెండు ప్రాజెక్టుల ప‌నుల‌ను ఏపీ స‌ర్కారు కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమ‌తి లేకుండానే కొన‌సాగిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. అనుమ‌తులు లేని ప్రాజెక్టుల‌ను త‌క్ష‌ణ‌మే నిలుపుద‌ల చేయాల‌ని కోరారు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై కేఆర్ఎంబీకి ప‌లుమార్లు ఫిర్యాదు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే త‌మ అభ్య‌ర్థ‌న‌ల‌ను కేఆర్ఎంబీ ఇప్ప‌టిదాకా అర్థం చేసుకోనేలేద‌ని కూడా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గాలేరు- న‌గ‌రి నుంచి హంద్రీ- నీవాలోకి నీటిని త‌ర‌లిస్తే... కృష్ణా జలాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించిన‌ట్టే అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.