ద‌మ్ముంటే గ‌న్‌మెన్ లేకుండా బ‌య‌ట‌కు రా!... ప‌రిటాల శ్రీరామ్‌కు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి స‌వాల్‌!

12-08-2022 Fri 19:37
  • రాప్తాడులో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మాట‌ల యుద్ధం
  • టీడీపీ అధికారంలోకి వ‌స్తే అధికారుల ప‌నిబ‌డ‌తామ‌న్న ప‌రిటాల శ్రీరామ్‌
  • ప‌రిటాల శ్రీరామ్ దౌర్జ‌న్యాల‌ను స‌హించేది లేద‌న్న ఎమ్మెల్యే ప్ర‌కాశ్ రెడ్డి
raptadu mla challenge to tdp leader paritala sreeram
అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య శుక్ర‌వారం మాట‌ల యుద్ధం చోటుచేసుకుంది. అధికారులు అధికార పార్టీ నేత‌లు చెప్పిన‌ట్టుగా న‌డుచుకుంటున్నార‌ని టీడీపీ నియోజ‌కవ‌ర్గ ఇంచార్జీ ప‌రిటాల శ్రీరామ్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే... వైసీపీకి అనుకూలంగా ప‌నిచేసిన అధికారుల ప‌నిబ‌డ‌తామ‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు.

ప‌రిటాల శ్రీరామ్ వ్యాఖ్య‌లపై వెనువెంట‌నే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి స్పందించారు. నేర‌స్థుల‌కు ఆశ్ర‌యమిచ్చే సంస్కృతి ప‌రిటాల కుటుంబానిదేన‌ని ఆరోపించిన ప్ర‌కాశ్ రెడ్డి... ప‌రిటాల శ్రీరామ్ దౌర్జ‌న్యాలు చేస్తుంటే స‌హించేది లేద‌ని చెప్పారు. పోలీసులు నిజాయ‌తీగా ప‌నిచేయ‌డం ప‌రిటాల శ్రీరామ్‌కు న‌చ్చ‌ద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ద‌మ్ముంటే గ‌న్ మెన్ లేకుండా ప‌రిటాల శ్రీరామ్ బ‌య‌ట‌కు రావాల‌ని ఈ సంద‌ర్భంగా తోపుదుర్తి స‌వాల్ విసిరారు.