రజనీతో సినిమా అంటే మాటలా?: 'విక్రమ్' డైరెక్టర్

12-08-2022 Fri 19:00
  • వరుస హిట్లతో ఉన్న లోకేశ్ కనగరాజ్ 
  • 'విక్రమ్' హిట్ తో పెరిగిపోయిన డిమాండ్ 
  • రజనీ కోసం లైన్ రెడీ అంటున్న లోకేశ్  
  • ఆయనతో సినిమానే తన డ్రీమ్ అంటున్న డైరెక్టర్
Rajani in Lokesh kanagaraj
కమలహాసన్ కెరియర్లో ఎన్నో ఆణిముత్యాలు .. మరెన్నో మైలురాళ్లు ఉన్నాయి. ప్రయోగాల పరంగా అవన్నీ ఒక ఎత్తయితే, సక్సెస్ పరంగా చూసుకుంటే 'విక్రమ్' ఒక ఎత్తుగా కనిపిస్తుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమాకి దర్శకుడు లోకేశ్ కనగరాజ్. 

కమల్ కి ఆ స్థాయి హిట్ ఇచ్చిన లోకేశ్ .. రజనీకాంత్ తో కూడా సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై లోకేశ్  స్పందిస్తూ .. "రజనీ సార్ తో సినిమా అంటే మాటలా? మార్కెట్ పరంగా .. క్రేజ్ పరంగా రజనీ సార్ కి తగిన కథను రెడీ చేయడం అంత తేలికైన పనేం కాదు" అన్నాడు.

రజనీ సార్ తో సినిమా చేయాలనేది నా కల. ఆయనతో చేసే సినిమా ఎలా ఉండాలనే విషయంలో నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. దానికి తగినట్టుగానే ఒక లైన్ ను రెడీ చేశాను. అది తప్పకుండా రజనీ సార్ కి నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాననే నమ్మకం నాకు ఉంది" అని చెప్పుకొచ్చాడు.