హర్ ఘర్ తిరంగా ఎఫెక్ట్.. 10 రోజుల్లో ఎన్ని జాతీయ జెండాలు అమ్ముడుపోయాయో తెలిస్తే షాకవుతారు

12-08-2022 Fri 18:16
  • 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న భారత్
  • హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి విపరీతంగా వస్తున్న స్పందన
  • పోస్టాఫీసుల ద్వారా ఇప్పటి వరకు కోటికి పైగా జెండాల అమ్మకం
Over 1 cr national flags sold in 10 days Har Ghar Tiranga
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. మరోవైపు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ జెండాలను పోస్టాఫీసుల ద్వారా విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరలో రూ. 25కి ఒక్కో జెండాను అమ్ముతున్నారు. గత 10 రోజుల్లో ఏకంగా ఒక కోటికి పైగా జెండాలు అమ్ముడుపోయాయని కేంద్ర ప్రసారశాఖ వెల్లడించింది. 

దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి గడపకు చేరిందని తెలిపింది. పోస్టాఫీసుల్లో, ఆన్ లైన్ ద్వారా జెండాల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పింది. దేశంలోని ఏ అడ్రస్ కైనా పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉచితంగానే జెండాలను డోర్ డెలివరీ చేస్తోందని తెలిపింది. ఈపోస్ట్ ఆఫీస్ పోర్టల్ ద్వారా 1.75 లక్షల జెండాలు ఆన్ లైన్ లో అమ్ముడుపోయాయని చెప్పింది. ఈ రెండు రోజుల్లో మరింత పెద్ద సంఖ్యలో జెండాలు అమ్ముడుపోయే అవకాశం ఉంది.