Nasa: భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లు.. నేటి నుంచి ఐదు రోజుల్లో నాలుగు గ్రహ శకలాలు రానున్నట్టు నాసా వెల్లడి

  • శుక్రవారమే భూమి పక్కనుంచి దూసుకెళ్లనున్న ఒక ఆస్టరాయిడ్
  • ఆగస్టు 14న ఒకదాని వెనుక మరొకటిగా రానున్న రెండు గ్రహశకలాలు
  • 16వ తేదీన భూమికి సమీపంగా వెళ్లనున్న మరో ఆస్టరాయిడ్
  • వీటితో పెద్దగా ప్రమాదమేమీ లేదని ప్రకటించిన నాసా
NASA has revealed that four planetary fragments will arrive in five days from today

కోట్ల ఏళ్ల కిందట భూమిని ఏలిన డైనోసార్లు సహా 90 శాతం జీవాన్ని తుడిచి పెట్టేసినది ఓ ఆస్టరాయిడ్. ఆ తర్వాతా భూమిపై ఎన్నో ఉత్పాతాలకూ ఆస్టరాయిడ్లు (గ్రహ శకలాలు) కారణమయ్యాయి. అలా అంతరిక్షంలో తిరుగుతూ ఉండే ఆస్టరాయిడ్లు అప్పుడప్పుడూ భూమికి సమీపం నుంచి దూసుకెళ్తుండటం మామూలే. 

మరీ చిన్న గ్రహ శకలాలు అయితే.. భూమి వాతావరణంలోకి ప్రవేశించినా మధ్యలోనే మండిపోతాయి. పెద్ద గ్రహ శకలాలు భూ వాతావరణంలో ప్రవేశిస్తే.. పూర్తిగా మండిపోక ముందే దిగువదాకా దూసుకొచ్చి భూమిని ఢీకొంటాయి. భారీ నష్టం కలిగిస్తుంటాయి. తాజాగా ఈ ఐదు రోజుల్లోనే ఏకంగా నాలుగు ఆస్టరాయిడ్లు భూమి సమీపం నుంచి దూసుకెళ్లనున్నట్టు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

నేటి నుంచే వరుస కట్టి..
అంతరిక్షంలో తిరుగాడుతున్న ఆస్టరాయిడ్లలో భూమికి కనీసం 75 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి దూసుకెళ్లే అవకాశమున్న వాటిపై నాసా నిత్యం నిఘా పెట్టి ఉంచుతుంది. అందులోనూ 150 మీటర్లకన్నా పెద్ద పరిమాణంలో ఉండేవాటిని అత్యంత ప్రమాదకర ఆస్టరాయిడ్ల జాబితాలో చేర్చి ప్రత్యేకంగా నిఘా పెడుతుంది. నిజానికి లక్షల కిలోమీటర్ల దూరం అంటే ఎక్కువే అయినా.. భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనై వచ్చి ఢీకొనే అవకాశాలూ ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లనూ గుర్తించి నిఘా పెట్టినట్టు వివరించారు.

  • శుక్రవారం (ఆగస్టు 12న) ‘2015 ఎఫ్ఎఫ్’గా పిలిచే ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా వెళ్లనుంది. 53 అడుగుల (సుమారు 16 మీటర్లు) వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ తో పెద్దగా ప్రమాదం లేదని నాసా తెలిపింది.
  • భారత కాలమానం ప్రకారం ఆగస్టు 14న (ఆదివారం) తెల్లవారుజామున 3.23 గంటల సమయంలో ‘2022 ఓటీ1’గా పిలిచే ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా వెళ్లనుంది. 110 అడుగుల (సుమారు 34 మీటర్లు) పరిమాణమున్న ఈ గ్రహ శకలం భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఏకంగా గంటకు 20,520 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని నాసా తెలిపింది. ఇంత పరిమాణం, ఇంత వేగం ఉన్న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొడితే కొన్ని వందల చదరపు కిలోమీటర్ల మేర సర్వ నాశనం అవుతుందని పేర్కొంది.
  • ఆగస్టు 14న మధ్యాహ్నం 71 అడుగుల (సుమారు 22 మీటర్లు) పరిమాణం ఉన్న ‘2022 ఓఏ4’ ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా దూసుకుపోనుందని నాసా తెలిపింది.
  • ఆగస్టు 16న 93 అడుగుల (29 మీటర్లు) వెడల్పున్న ‘2022 పీడబ్ల్యూ’ ఆస్టరాయిడ్ భూమికి పక్కగా ప్రయాణించనుందని వెల్లడించింది.


More Telugu News