అసోం పర్యటనను వాయిదా వేసుకోవాలని అమీర్ ఖాన్ ను కోరిన ముఖ్యమంత్రి... కారణం ఇదే!

12-08-2022 Fri 16:23
  • 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ప్రమోషన్ కోసం గువాహటికి వెళ్లనున్న ఆమిర్
  • ఆగస్ట్ 15 తర్వాత రావాలన్న సీఎం బిశ్వా
  • 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న సీఎం
Assam CM requests Aamir Khan to postpone his visit to Guwahati
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన అసోం పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా కోరారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని... అందువల్ల పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆమిర్ ను కోరుతున్నామని చెప్పారు. 

ఆమిర్ ఖాన్ తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ నెల 14న గువాహటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం బిశ్వా మాట్లాడుతూ, ఆమిర్ తనతో కూడా మాట్లాడారని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవని... అందువల్ల ఆ స్ఫూర్తి బలహీనం కాకూడదని తాము కోరుకుంటున్నామని... అందుకే పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆమిర్ ను కోరామని అన్నారు. 

స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత ఎప్పుడొచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పామని తెలిపారు. ఆమిర్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని... అప్పుడప్పుడు ఫోన్ ద్వారా తాము మాట్లాడుకుంటుంటామని చెప్పారు. మరోవైపు ఆమిర్ పర్యటన సందర్భంగా ఆయనతో కలిసి సీఎం బిశ్వా కూడా సినిమా చూస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు సీఎం సూచన నేపథ్యంలో ఆగస్ట్ 16న ఆమిర్ అక్కడకు వెళ్లే అవకాశం ఉంది.