ఎమ్మెల్సీ అనంత‌బాబుకు రిమాండ్ పొడిగింపు.. బెయిల్‌పై పూర్తి కాని విచార‌ణ‌

12-08-2022 Fri 14:52
  • ఈ నెల 26 వ‌ర‌కు రిమాండ్ పొడిగింపు
  • సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో రిమాండ్‌లో ఉన్న అనంత‌బాబు
  • బెయిల్ పిటిష‌న్‌పై ఇంకా తేల్చ‌ని కోర్టు
  • తిరిగి సెంట్ర‌ల్ జైలుకు అనంత‌బాబు త‌ర‌లింపు
rajamahendravaram court extends mlc anantha babu remand upto 26th of this month
డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన ఏపీ ఎమ్మెల్సీ అనంత‌బాబుకు విధించిన రిమాండ్‌ను పొడిగిస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు శుక్ర‌వారం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఈ కేసులో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కేంద్ర కారాగారంలో విచార‌ణ ఖైదీగా ఉన్న అనంత‌బాబు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ శుక్ర‌వారంతో ముగిసింది. దీంతో ఆయ‌న‌ను పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. అనంత‌బాబుకు ఈ నెల 26 వ‌ర‌కు రిమాండ్‌ను పొడిగిస్తున్న‌ట్లుగా న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించ‌డంతో పోలీసులు అనంత‌బాబును తిరిగి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు.

ఇదిలా ఉంటే... త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ అనంత‌బాబు దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ ఇంకా పూర్తి కాలేదు. ఇప్ప‌టికే ఈ పిటిష‌న్‌పై పిటిష‌న‌ర్ త‌ర‌ఫు వాద‌న‌ల‌తో పాటు పోలీసుల త‌ర‌ఫు వాద‌న‌ల‌ను కూడా కోర్టు విన్న సంగ‌తి తెలిసిందే. అయితే బెయిల్ పిటిష‌న్‌పై కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేదు. త‌న వ‌ద్ద డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన సుబ్ర‌హ్మ‌ణ్యంను అత‌డి ఇంటి వ‌ద్ద నుంచే పిక‌ప్ చేసుకున్న అనంత‌బాబు... అత‌డిని తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న ఏపీలో పెను క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.