Ulephone: ఫోన్ లోనే ఇన్ బిల్ట్ గా వైర్ లెస్ ఇయర్ బడ్స్.. ప్రపంచంలో తొలిసారిగా ఆర్మర్ 15 మోడల్ ను తెచ్చిన యూల్ ఫోన్ సంస్థ!

  • ఫోన్ లోనే పైన ఇయర్ బడ్స్ అమర్చుకునే సదుపాయం.. అందులోనే చార్జింగ్
  • ముందువైపు పైన, కింద రెండు పెద్ద స్పీకర్లతో బిగ్గరగా ధ్వని
  • 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ.. 6,600 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ
  • కాస్త భారీ పరిమాణంలో ఫోన్ ను తీసుకొచ్చిన యూల్ ఫోన్ సంస్థ
Worlds first inbuilt earbuds phone from Ulefone

స్మార్ట్ ఫోన్ ఉన్నవారిలో చాలా మంది వైర్ లెస్ ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వంటివి కొని వినియోగించడం మామూలే. ఫోన్ మాట్లాడటంతోపాటు పాటలు వినడం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వంటి వాటికి ఎంతో ఉపయోగకరంగా ఉండటం.. అదీ పక్కనున్న వారికి ఇబ్బంది లేకుండా పనిచేసుకోగలగడం వీటితో వీలవుతుంది. 

అయితే, ఇందులో ఇయర్ బడ్స్ కొన్నవారికి వాటిని పెట్టుకునే కేస్ ను తీసుకెళ్లడం ఓ పెద్ద ఇబ్బంది. ఇయర్ బడ్స్ చార్జింగ్ కోసమూ అవి కీలకం. ఇక ఒక్కోసారి ఇయర్ బడ్స్ ఎక్కడో పడిపోతుంటాయి. వెతుక్కోవడం పెద్ద ఇబ్బందే. ఈ నేపథ్యంలోనే యూల్ ఫోన్ సంస్థ సరికొత్తగా.. ఫోన్ లో భాగంగానే (ఇన్ బిల్ట్) వైర్ లెస్ ఇయర్ బడ్స్ తో సరికొత్త మోడల్ ‘ఆర్మర్ 15’ను తీసుకువచ్చింది. కిక్ స్టార్టర్ వెబ్ సైట్ వేదికగా దీనిని ఆవిష్కరించింది.

ఫోన్ లోనే కేస్.. అందులోనే చార్జింగ్..
యూల్ ఫోన్ ఆర్మర్ 15 ఫోన్ కు పైభాగంలో రెండు వైర్ లెస్ ఇయర్ బడ్స్ తో కూడిన కేస్ ఇన్బిల్ట్ గా ఉంటుంది. వాటికిపైన మూతలు కూడా ఉంటాయి. కావాలనుకున్నప్పుడు ఇయర్ బడ్స్ ను బయటికి తీసుకుని వాడుకోవచ్చు. మళ్లీ ఫోన్ లోనే పెట్టేయొచ్చు. ఆ ఇయర్ బడ్స్ కు చార్జింగ్ కూడా అందులోనే అవుతుందని యూల్ ఫోన్ కంపెనీ ప్రకటించింది. కావాలంటే ఈ ఇయర్ బడ్స్ ను ఇతర ఫోన్లు, గాడ్జెట్లకూ అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది.

ఈ ఫోన్ ప్రత్యేకతలు మరెన్నో..
 

  • యూల్ ఫోన్ ఆర్మర్ 15 ఫోన్ లో 5.45 అంగుళాల హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది.
  • మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో.. 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీతో లభిస్తుంది.
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో పొందుపర్చామని కంపెనీ తెలిపింది
  • ఫోన్ లో ముందువైపు డిస్ ప్లేకు పైన, కింద రెండు చోట్ల పెద్ద పరిమాణంలో స్పీకర్లు ఉన్నాయి. యూజర్లకు మంచి ధ్వని అనుభవం అందుతుందని కంపెనీ పేర్కొంది.
  • ఈ ఫోన్ లో ఏకంగా 6,600 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. 
  • ఈ ఫోన్ లో వెనుక వైపు 13 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు.. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
  • కిక్ స్టార్టర్, యూల్ ఫోన్ వెబ్ సైట్లలో పేర్కొన్న ప్రకారం ఆర్మర్ 15 ఫోన్ ధర 170 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు 13,500 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం.

More Telugu News