ఎలాన్ మస్క్ కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ తెస్తారా?

12-08-2022 Fri 11:33
  • ట్విట్టర్ కొనుగోలు సఫలం కాకపోతే తెస్తారా? అంటూ ఎదురైన ప్రశ్న
  • ఎక్స్ డాట్ కామ్ అని రిప్లయ్ ఇచ్చిన మస్క్
  • ట్విట్టర్ కోసమే టెస్లా షేర్ల అమ్మకం.. అవసరమైతే మళ్లీ కొనుగోలు చేస్తానన్న మస్క్
Twitter User Asks Elon Musk About His Social Media Plans
ట్విట్టర్ ను కొంటానని ఆసక్తి చూపించి, నకిలీ స్పామ్ ఖాతాల పేరుతో డీల్ నుంచి తప్పుకుందామనుకున్న ఎలాన్ మస్క్ కోర్టు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ట్విట్టర్ డెలేవార్ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్లో మస్క్ ను ఓ ఫాలోవర్ ఒక ప్రశ్న వేశాడు. 

‘‘ట్విట్టర్ తో డీల్ సాకారం కాకపోతే.. మీ సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా?’’ అని యూజర్ ప్రశ్నించాడు. దీనికి మస్క్ సైతం నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడు. ఎక్స్ డాట్ కామ్ అన్న డొమైన్ పేరుతో రిప్లయ్ ఇచ్చారు. అంతకుమించి ఏమీ చెప్పలేదు. ఎక్స్ డాట్ కామ్ అనే పోర్టల్ ఆర్థిక సేవల కోసం మస్క్ ఏర్పాటు చేసింది. దీన్ని పేపాల్ కొనుగోలు చేసి విలీనం చేసుకుంది. తిరిగి 2017లో ఎక్స్ డాట్ కామ్ పోర్టల్ హక్కులను మస్క్ సొంతం చేసుకున్నారు.

తన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాలో మస్క్ 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను గత వారం విక్రయించడం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశిస్తే ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి అతడికి డబ్బులు అవసరం. దీంతో ముందుగానే ఆ నిధి మొత్తాన్ని షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకున్నారు. అయితే, ట్విట్టర్ కొనుగోలు చేయకపోతే తిరిగి ఈ మొత్తంతో టెస్లా షేర్లను కొనుగోలు చేస్తానని ఆయన ప్రకటించారు.