దయచేసి మాస్కులు పెట్టుకోండి: లాయర్లకు సీజేఐ ఎన్వీ రమణ సూచన

11-08-2022 Thu 16:46
  • సుప్రీంకోర్టు జడ్జిలు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారన్న సీజేఐ
  • కోర్టు హాళ్లలో అందరూ మాస్కులు ధరించాలని విన్నపం
  • సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైనం
CJI NV Ramana requests lawyers to wear mask
కోర్టు హాళ్లలో ఉండే న్యాయవాదులందరూ మాస్కులు పెట్టుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. పలువురు సుప్రీంకోర్టు జడ్జిలు, సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు న్యాయవాదులను కోరారు. మన జడ్జిలు, కోర్టు సిబ్బంది కరోనా బారిన పడుతున్నారని... అందువల్ల కోర్టు హాళ్లలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెప్పారు.

ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, తనకు నెగెటివ్ వచ్చిందని చెప్పారు. సీనియర్ అడ్వొకేట్ ఏఎం సింఘ్వికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో, సింఘ్వి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై విచారణ జరిపే సమయంలో మాస్కులు ధరించాలనే విన్నపాన్ని ఆయన చేశారు.