గోరంట్ల మాధ‌వ్ వీడియో పోస్ట్ చేసిన యూకే వ్య‌క్తితో నారా లోకేశ్ ఎందుకు మాట్లాడారు?: వైసీపీ నేత నాగార్జున యాద‌వ్‌

11-08-2022 Thu 14:51
  • గోరంట్ల మాధ‌వ్ వీడియోను పోస్ట్ చేసింది యూకే వ్య‌క్తి అని నిర్ధార‌ణ‌
  • యూకే వ్య‌క్తితో నారా లోకేశ్ అర్థ‌రాత్రి వేళ మాట్లాడారని వైసీపీ ఆరోప‌ణ‌
  • నారా లోకేశ్ త‌న ఫోన్‌ను పోలీసుల‌కు ఇవ్వ‌డానికి సిద్ధ‌మేనా అన్న నాగార్జున యాద‌వ్‌
ysrcp Official Spokesperson Nagarjuna Yadav alleges that nara lokesh talks with uk citizen who posted mp gorantla madhav video on social media
మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు చెందిన‌దిగా భావిస్తున్న వీడియో వ్య‌వ‌హారంపై అదికార, విప‌క్షాల‌పై మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వీడియోను ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యక్తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశార‌ని బుధ‌వారం అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వీడియో ఏ నెంబ‌రు నుంచి పోస్ట్ అయ్యింద‌న్న విష‌యాన్ని తెలిపిన ఎస్పీ... ఆ వ్య‌క్తి వివ‌రాల గురించి ఆరా తీస్తున్న‌ట్లు తెలిపారు.

తాజాగా స‌ద‌రు వీడియోను పోస్ట్ చేసిన యూకే వ్య‌క్తితో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ మాట్లాడారంటూ వైసీపీ అధికార ప్ర‌తినిధి నాగార్జున యాద‌వ్ గురువారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఓ టీవీ ఛానెల్ చ‌ర్చావేదిక‌లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా నాగార్జున ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

గోరంట్ల మాధవ్ వీడియోను అప్‌లోడ్‌ చేసిన 447443703968 నెంబర్ ఉన్న యూకే వ్యక్తితో నారా లోకేశ్‌ అర్ధరాత్రి 1:48 నిమిషాల సమయాన ఫోన్ చేసి, 8 నిమిషాల పాటు మాట్లాడిన మాట వాస్తవం కాదా? అని అయ‌న ప్ర‌శ్నించారు. గోరంట్ల మాధవ్ త‌న‌ ఫోన్ ఇవ్వడానికి సిద్ధం అంటున్నార‌ని గుర్తు చేసిన నాగార్జున‌... మరి, నారా లోకేశ్‌ కూడా త‌న ఫోన్‌ను పోలీసులకు అందజేయడానికి సిద్ధమా? అని స‌వాల్ విసిరారు.