ఐరాసలో భారత్, అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ప్రతిపాదనకు చైనా మోకాలడ్డు
- పాక్ కేంద్రంగా జైషే మహ్మద్ కార్యకలాపాలు
- అబ్దుల్ రవూఫ్ అజహర్ పై ఆంక్షలకు భారత్, అమెరికా ప్రయత్నం
- భద్రతా మండలి ఆంక్షల కమిటీ ముందుకు ప్రతిపాదన
- ప్రక్రియను నిలుపుదల చేసిన చైనా
జైషే మహ్మద్ కు చెందిన అబ్దుల్ రవూఫ్ అజహర్ పై అంతర్జాతీయ ప్రయాణ నిషేధం విధించాలని, అతడి ఆస్తులను స్తంభింపజేయాలని భారత్, అమెరికా కోరుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని 15 సభ్య దేశాలతో కూడిన ఆంక్షల కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తేనే ఇది కార్యరూపం దాల్చుతుంది.
అయితే చైనా తనకున్న విశేషాధికారంతో ఈ ప్రక్రియను తొక్కిపెట్టింది. భారత్, అమెరికా తెరపైకి తెచ్చిన ఈ ప్రతిపాదనను తాము మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ఐక్యరాజ్యసమితిలో చైనా అధికార ప్రతినిధి వెల్లడించారు. సభ్యదేశాల ప్రతిపాదనలను నిలుపుదల చేయడం, అధ్యయనం చేయడం కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటివి చోటుచేసుకున్నాయని చైనా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.