RBI: లోన్ యాప్ లను మూడు కేటగిరీలుగా విభజించిన ఆర్బీఐ

  • ఇటీవల పెరిగిన లోన్ యాప్ ల కార్యకలాపాలు
  • పలు యాప్ ల నిర్వాహకులపై ఫిర్యాదులు
  • కొత్త నియంత్రణ వ్యవస్థకు ఆర్బీఐ రూపకల్పన
RBI divides digital lending entities into three categories

ఇటీవల కాలంలో లోన్ యాప్ లు విస్తృతం కాగా, అదే సమయంలో పలు యాప్ ల నిర్వాహకులు వినియోగదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరు దిగ్భ్రాంతిని కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. దేశంలో డిజిటల్ విధానంలో రుణాల మంజూరు క్రమానుగతంగా వృద్ధి చెందుతుందన్న నేపథ్యంలో, వివిధ వర్గాల్లో పెరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 

రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న సంస్థలు, లేక అనుమతి పొందిన మరేవైనా ఆర్థిక సంస్థల అధీనంలోని సంస్థలను ఆధారంగా చేసుకుని ఈ నియంత్రణ వ్యవస్థకు రూపకల్పనం చేయడం జరిగిందని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ లో వివరించింది. 

డిజిటల్ విధానంలో అప్పులు ఇచ్చే సంస్థలను మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. అవి 1.) ఆర్బీఐ అనుమతి పొంది రుణ మంజూరు వ్యాపారం చేసే సంస్థలు. 2) ఆర్బీఐ నియంత్రణలో లేని... ఇతర చట్టబద్ధమైన, నియంత్రణ నిబంధనలకు లోబడి నడుచుకునే రుణ సంస్థలు. 3) ఎలాంటి చట్టబద్ధత లేని, నియంత్రణ నిబంధనలకు లోబడని సంస్థలుగా విభజించింది.

కొత్త నిబంధనల ప్రకారం... అన్ని రుణ పంపిణీలు, తిరిగి చెల్లింపులు రుణ గ్రహీత, ఆర్థిక సంస్థ బ్యాంకు ఖాతాల మధ్యనే జరగాలని, ఇందులో మూడవ పక్షానికి తావు ఉండరాదని ఆర్బీఐ పేర్కొంది. అంతేకాదు, రుణ సంస్థకు చెల్లించే ఫీజు, చార్జీలు ఇతరత్రా నేరుగా నియంత్రణ వ్యవస్థ ద్వారానే చెల్లించబడతాయి. ఇందులో రుణ గ్రహీతపై భారం ఉండదు. 

అంతేకాదు, రుణ పరిమితిపై రుణ గ్రహీతల అనుమతి లేకుండా ఆటోమేటిక్ పెంపుదలను ఈ నిబంధనలు నిరోధిస్తాయి. ఇక, వినియోగదారుల ఫిర్యాదులను నియంత్రణ వ్యవస్థలు 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే, సదరు రుణ గ్రహీత రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీమ్ కింద ఫిర్యాదు చేయవచ్చు.

ముఖ్యంగా, లోన్ యాప్ లు రుణగ్రహీత అనుమతి లేకుండా అతడి డేటా సేకరించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతేకాదు, తన సమాచారాన్ని సేకరించేందుకు సదరు యాప్ కు గతంలో ఇచ్చిన అనుమతిని తర్వాత కాలంలో తొలగించేందుకు కూడా రుణగ్రహీతలకు ఆప్షన్ ఇవ్వాలని పేర్కొంది.

More Telugu News