రాష్ట్రాల‌కు ప‌న్నుల వాటాను విడుద‌ల చేసిన కేంద్రం... ఏపీకి రూ.4,721 కోట్లు, తెలంగాణ‌కు రూ.2,452 కోట్లు

10-08-2022 Wed 20:23
  • అత్య‌ధికంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రూ.20,928 కోట్లు విడుద‌ల
  • అత్య‌ల్పంగా గోవాకు రూ.450.32 కోట్లు విడుద‌ల‌
  • రెండు విడ‌తల మొత్తం రూ.1,16,665.75 కోట్లు విడుద‌ల‌
దేశంలోని అయా రాష్ట్రాల నుంచి ప‌న్నుల‌ను అందుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వం... అందులో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాల‌కు విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ప‌న్నుల వాటా విడుద‌ల‌లో భాగంగా బుధ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం ఆయా రాష్ట్రాల‌కు రెండు విడ‌తల ప‌న్నుల వాటా మొత్తం రూ.1,16,665.75 కోట్ల‌ను విడుద‌ల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్ప‌డానికి ఈ ప‌న్నుల వాటా విడుద‌లే నిద‌ర్శ‌న‌మ‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

రాష్ట్రాల‌కు బుధ‌వారం విడుద‌లైన ప‌న్నుల వాటాలో అత్య‌ధికంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రూ.20,928 కోట్లు విడుద‌ల కాగా... ఆ త‌ర్వాత స్థానంలో నిలిచిన‌ బీహార్‌కు రూ.11,734 కోట్లు విడుద‌ల‌య్యాయి. ఇక ఈ ప‌న్నుల వాటాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.4,721 కోట్లు, తెలంగాణ‌కు రూ.2,452 కోట్లు విడుద‌ల‌య్యాయి. గోవాకు అత్యల్పంగా రూ.450.32 కోట్లు విడుద‌లయ్యాయి.