ఎనిమిదేళ్లలో రూ.50 వేల కోట్లు మిగిల్చాం.. పెట్రోల్​ లో ఇథనాల్​ కలపడంపై ప్రధాని మోదీ

10-08-2022 Wed 19:58
  • విదేశీ మారక ద్రవ్యం రూపంలో మిగిల్చిన రూ.50 వేల కోట్లు రైతులకు చేరాయన్న ప్రధాని
  • హరియాణాలో భారీ ఇథనాల్ ప్లాంటును ప్రారంభించిన మోదీ
  • ఇథనాల్ ప్లాంటుతో కాలుష్యం నియంత్రణలో ఉంటుందని వెల్లడి
RS 50k crore saved by blending ethanol with petrol says PM Modi
దేశంలో పెట్రోల్ లో ఇథనాల్ కలపాలన్న నిర్ణయంతో గత ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.50 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మిగిల్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అదే సమయంలో దేశ రైతులకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. హరియాణాలోని పానిపట్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన రెండో జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ ను ప్రధాని మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రూ.900 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఇథనాల్ ప్లాంట్ రైతుల ఆదాయం పెరగడానికి తోడ్పడుతుందని వెల్లడించారు.

రైతులకు రూ.50 వేల కోట్లు
విదేశీ మారక ద్రవ్యం రూపంలో మిగిల్చిన రూ.50 వేల కోట్లు.. ఇథనాల్ కోసం వినియోగించిన పంట ఉత్పత్తుల రూపంలో రైతులకు చేరాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లలో దేశంలో ఇథనాల్ ఉత్పత్తి 40 కోట్ల లీటర్ల నుంచి 400 కోట్ల లీటర్లకు పెరిగిందని చెప్పారు. హరియాణాలోని పానిపట్ లో నిర్మించిన ఈ ఇథనాల్ ప్లాంటు ద్వారా.. రైతులు పంటలను కాల్చివేయడం తగ్గుతుందని, కాలుష్యం సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రకటించారు.