రెండు చేతుల‌తో 11 రీతుల్లో చ‌క‌చ‌కా రాస్తున్న చిన్నారి... వీడియో ఇదిగో

10-08-2022 Wed 16:13
  • ఒకేసారి రెండు చేతులతో రాస్తున్న మంగ‌ళూరు బాలిక‌
  • బాలిక వీడియోను పంచుకున్న రిటైర్డ్ ఎయిర్ మార్ష‌ల్‌
  • 10 ల‌క్ష‌ల మందిలో ఒక‌రికి ఇలాంటి శ‌క్తి ఉంటుంద‌ని వెల్ల‌డి
  • ఈ ప‌వ‌ర్‌ను ఆంబిడెక్సెరిటీగా పిలుస్తార‌న్న అనిల్ చోప్రా
Retd Air Marshal Anil Chopra posts a video of mangalore girls AMBIDEXTERITY power
కింది వీడియోలో రెండు చేతులతో చ‌కచ‌కా రాసేస్తున్న బాలిక పేరు ఆది స్వ‌రూప‌. క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరుకు చెందిన ఈ బాలిక రెండు చేతులతో 11 విభిన్న రీతుల్లో అక్ష‌రాలు రాసేస్తోంది. అది కూడా భలే స్పీడుతో. స‌వ్య దిశ‌లో, అప‌స‌వ్య దిశ‌లోనే కాకుండా... ఓ చేత్తో స‌వ్య దిశ‌లో మ‌రో చేతితో అప‌స‌వ్య దిశ‌లో రాస్తున్న ఈ బాలిక‌... ఒకేసారి రెండు చేతుల‌తో ఒకే వాక్యాన్ని స‌వ్య‌, అప‌స‌వ్య దిశ‌ల్లో రాసేస్తోంది. అంతేకాదండోయ్‌... ప‌లు క‌న్న‌డ‌, తెలుగు, ఆంగ్లం సహా ప‌లు భాష‌ల్లోనూ చక‌చ‌కా రాసేస్తోంది.

సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నారి వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. భార‌త వైమానిక ద‌ళానికి చెందిన రిటైర్డ్ ఎయిర్ మార్ష‌ల్ అనిల్ చోప్రా ఈ చిన్నారి వీడియోను సోష‌ల్ మీడియాలో పోప్ట్ చేశారు. అంతేకాకుండా బాలిక‌లోని అద్భుత సామ‌ర్ధ్యాన్ని కూడా ఆయ‌న వివ‌రించారు. 10 ల‌క్ష‌ల మందిలో ఒక‌రికి ఉండే ఈ త‌ర‌హా శ‌క్తిని ఆంబిడెక్సెరిటీగా పిలుస్తార‌ని తెలిపారు. మెద‌డులోని రెండు భాగాలు ఒకేసారి ఒకేలా ప‌నిచేయడం వ‌ల్ల ఈ త‌ర‌హా అద్భుత శ‌క్తి సంక్ర‌మిస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఆది స్వ‌రూప అనే పేరున్న ఈ బాలిక నిజంగానే ఆది స్వ‌రూపిణే అని ఆయ‌న ప్ర‌శంసించారు.