Whatsapp: వాట్సాప్​ లో సరికొత్త ఫీచర్స్​.. ఆన్​ లైన్​ లో ఉన్నట్టు కొందరికే కనిపించొచ్చు.. ఎవరికీ తెలియకుండా గ్రూప్​ నుంచి ఎగ్జిట్​ కావొచ్చు!

  • అవతలి వారు ఒకసారి చూడగానే మెసేజీలు డిలీట్..
  • వీటిని స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం లేకుండా ఆప్షన్
  • త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించిన వాట్సాప్
Whatsapp new privacy features

వాట్సాప్ లో చాటింగ్ చేస్తుంటాం.. లేకుంటే గ్రూపుల్లోనో, ఎవరైనా పంపినవో వీడియోలు, ఫొటోలు చూస్తుంటాం. ఆ సమయంలో మనం ఆన్ లైన్ లో ఉన్నట్టు అందరికీ తెలిసిపోతుంటుంది. అలా కనిపించకుండా ఆఫ్ చేసుకుందాం అనుకుంటే.. మిగతా ఎవరైనా ఆన్ లైన్ లో ఉన్నారో, ఆఫ్ లైన్ లో ఉన్నారో మనకు కనిపించకుండా పోతుంది. ఈ క్రమంలోనే మనకు కావాలనుకున్నవారికే ఆన్ లైన్ లో ఉన్నదీ, లేనిదీ కనిపించేలా చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తేనుంది.

అంతేకాదు.. గ్రూపుల్లోంచి ఎవరికీ తెలియకుండా ఎగ్జిట్ కావడం, ఒకసారి చూసిన వెంటనే డిలీట్ అయిపోయేలా మెసేజీలు పంపడం, అలా పంపిన వ్యూ వన్స్ మెసేజీలను స్క్రీన్ షాట్ తీసుకునే వీలు లేకుండా చేయడం వంటి మరిన్ని సదుపాయాలనూ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇవన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ ప్రకటించింది.

 గ్రూపుల్లో నోటిఫికేషన్ లేకుండా ఎగ్జిట్
సాధారణంగా మనం చాలా వాట్సాప్ గ్రూపులలో ఉంటుంటాం. కొన్నిసార్లు మొహమాటానికి యాడ్ అవుతుంటాం. వాటిలోంచి ఎగ్జిట్ అవుదామంటే.. గ్రూపులో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరేం అనుకుంటారోనన్న ఇబ్బంది. ఈ క్రమంలోనే గ్రూపుల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎగ్జిట్ అయ్యే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకు వస్తోంది. అయితే గ్రూపు అడ్మిన్లకు మాత్రం ఈ విషయం తెలుస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

ఆన్ లైన్ లో ఉన్న విషయం ఎవరెవరికి కనబడాలో వారికే..
మనం వాట్సాప్ ఓపెన్ చేసి ఉన్నామా, లేదా అన్న విషయం అందరికీ తెలియడం మనకు ఇష్టం ఉండదు. ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారన్న ప్రశ్నలు ఎదురవుతూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఆన్ లైన్ లో ఉండి కూడా సమాధానం ఇవ్వడం లేదేమన్న ప్రశ్నలూ వస్తుంటాయి. అలాగని అందరికీ కనిపించకుండా ఆఫ్ చేసుకోవడం ఇష్టం లేని వారి కోసం వాట్సాప్ కొత్త సదుపాయాన్ని తెస్తోంది. ఆన్ లైన్ లో ఉన్న విషయం కొందరికే కనిపించేలా, లేదా కొందరికి మాత్రమే కనిపించకుండా ఆఫ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి రానుంది. 

ఒకసారి చూసి డిలీట్ చేసే మెసేజీలు.. స్క్రీన్ షాట్ తీయకుండా లాక్
ఎవరికైనా ఏదైనా ఒకసారి చూసి డిలీట్ చేసేలా ‘వ్యూ వన్స్’ ఆప్షన్ తో మెసేజీ పంపినప్పుడు వారు ఆ మెసేజీని చదవగానే డిలీట్ అయిపోయే సరికొత్త ఆప్షన్ ను వాట్సాప్ ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. అయితే ఒకసారి చూసి డిలీట్ చేసే మెసేజీలనూ కొందరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటుండటం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో ‘వ్యూ వన్స్’ ఆప్షన్ కింద పంపిన మెసేజీలను స్క్రీన్ షాట్ తీసేందుకు వీలు లేకుండా లాకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ తీసుకువస్తోంది.

More Telugu News