ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి: కేజ్రీవాల్​

09-08-2022 Tue 16:08 | National
  • ప్రస్తుతం మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఢిల్లీ సీఎం
  • దేశ రాజధానిలో ఏకంగా 17.85 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు
  • కరోనా రెండో వేవ్ నాటి తరహాలో పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోందన్న అంచనాలు
Covid cases rising in delhi but no need to panic says kejriwal
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు గణనీయ స్థాయిలో పెరుగుతున్నాయని.. అయితే చాలా కేసుల్లో లక్షణాలు తక్కువగా ఉంటున్నాయని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతానికి ఆందోళనేదీ అవసరం లేదని ప్రకటించారు. ఢిల్లీలో ఆదివారం రోజున కొత్తగా 1,372 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు ఏకంగా 17.85 శాతంగా నమోదైందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. అంటే పరీక్షలు చేసిన ప్రతి ఆరుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వివరించారు.

భారీగా కేసుల నేపథ్యంలో..
సోమవారం రోజున ఢిల్లీలో 2,423 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 14.97 శాతంగా నమోదైంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. 

‘‘కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఏయే చర్యలు తీసుకోవాలన్నది పరిశీలిస్తున్నాం. చాలా వరకు కేసుల్లో లక్షణాలు తక్కువగా ఉంటుండటం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.