Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నివాసంపై ఎఫ్బీఐ దాడులు.. మండిపడిన మాజీ అధ్యక్షుడు

FBI raids on Donald Trump house
  • ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్ పై ఎఫ్బీఐ రెయిడ్స్
  • స్వయంగా వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్
  • తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదనే దురుద్దేశంతో దాడులు చేశారని విమర్శ  
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన ఎస్టేట్ పై ఎఫ్బీఐ అధికారులు దాడులు చేశారని ఆయన తెలిపారు. ఫ్లోరిడాలో ఉన్న తన మార్-ఎ-లాగో ఎస్టేట్ పై రెయిడ్ చేశారని చెప్పారు. తన ఎస్టేట్ ను ఎఫ్బీఐ ఆక్రమించుకుందని మండిపడ్డారు. ఎఫ్బీఐ చర్య చాలా దారుణమని విమర్శించారు. 

తన అందమైన నివాసాన్ని పెద్ద సంఖ్యలో వచ్చిన ఎఫ్బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని దుయ్యబట్టారు. మన దేశానికి ఇవి చీకటి రోజులని చెప్పారు. తన ట్రూత్ సోషల్ నెట్ వర్క్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఎఫ్బీఐ చర్య ముమ్మాటికీ ప్రాసిక్యూటోరియల్ దుష్ప్రవర్తన, న్యాయ వ్యవస్థ ఆయుధీకరణ అని... 2024లో అధ్యక్ష పదవికి తాను పోటీ చేయకూడదని కోరుకునే రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ల దాడి అని చెప్పారు. ఇంట్లో తన సేఫ్ ని కూడా పగలగొట్టారని అన్నారు.  

మరోవైపు సంబంధిత అధికారులు మాట్లాడుతూ... ట్రంప్ ఎస్టేట్ లోకి ప్రవేశించేందుకు ఎఫ్బీఐ సెర్చ్ వారంట్ జారీ చేసిందని చెప్పారు. దాడుల్లో ట్రంప్ ఎస్టేట్ నుంచి 15 బాక్స్ ల వైట్ హౌస్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గత ఏడాది వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ఎస్టేట్ లో ట్రంప్ ఉంటున్నారు.
Donald Trump
FBI
Raids

More Telugu News