New Delhi: వీధిలో ఆడుకోవద్దంటూ పిల్లలపై కాల్పులు.. ముగ్గురు పిల్లలకు గాయాలు ఈశాన్య ఢిల్లీలో ఘటన..

  • వీధిలో ఆడుకోవద్దని, వెళ్లిపోవాలని బెదిరించిన ఆమిర్ అనే వ్యక్తి
  • స్థానికులు నిలదీయడంతో ఆగ్రహంతో పిల్లలపై కాల్పులు జరిపిన వైనం
  • సెమీ ఆటోమేటిక్ రివాల్వర్ ను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
Man opens fire injures 3 children in delhi

ఢిల్లీలోని ఓ ప్రాంతంలో పుట్టిన రోజు వేడుక జరుగుతోంది. ఆ వీధిలోనే కొందరు చిన్నారులు రోడ్డుపై ఆడుకుంటున్నారు. అక్కడికి వచ్చిన అతిథుల్లో ఒకరు.. ఆ పిల్లలను అక్కడ ఆడుకోవద్దని, వెళ్లిపోవాలని బెదిరించాడు. కానీ పిల్లలు ఆడుకుంటూనే ఉండటంతో తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి కాల్పులు జరిపాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పిల్లలపై కాల్పులు జరిపిన దుండగుడిని  22 ఏళ్ల ఆమిర్ అలియాస్ హమ్జాగా గుర్తించారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులకు బుల్లెట్ గాయాలయ్యాయి.

సెమీ ఆటోమేటిక్ పిస్టల్ తో..
కాల్పుల ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పిల్లలు వీధిలో ఆడుకుంటుంటే ఆమిర్ వచ్చి వారిని తిట్టాడని స్థానికులు చెప్పారు. అక్కడ ఆడుకోవద్దని, వెళ్లిపోవాలని బెదిరించాడని.. అది చూసిన స్థానికులు ఆమిర్ ను నిలదీశారని తెలిపారు. దీనితో ఆగ్రహానికి గురైన ఆమిర్ రివాల్వర్ తీసి పిల్లలపై కాల్పులు జరిపాడని వివరించారు.

ముగ్గురూ 13 ఏళ్ల లోపువారే..
పోలీసులు సదరు రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. అది సెమీ ఆటోమేటిక్ రివాల్వర్ అని.. ఏడు నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు పిల్లలు ఈ కాల్పుల్లో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ముగ్గురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని..  ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఈశాన్య ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ సేన్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపిన వాళ్లపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News