ఉన్నట్టుండి భూమి కుంగిపోయింది.. చిలీలో 50 అంతస్తుల భవనం అంత లోతుగా భారీ బిలం!

08-08-2022 Mon 21:48
  • ఉన్నట్టుండి ఒక్కసారిగా కుంగిపోయిన భూమి..
  • చిలీలోని రాగి గనుల పక్కన వ్యవసాయ భూమిలో అతి భారీ బిలం
  • భూమి లోపలి పొరల్లో భారీ రాళ్లు పగిలినప్పుడు ఇలా బిలాలు ఏర్పడుతాయన్న శాస్త్రవేత్తలు
The earth has sunk the biggest crater in Chile
ఉన్నట్టుండి మన ముందు భూమి కుంగిపోతే ఎలా ఉంటుంది? అదీ ఇంతా అంతా కాదు.. ఏదో ప్రళయం వస్తుందా, ఏవైనా ఏలియన్లు ఇలా చేశాయా అన్నట్టుగా చాలా పెద్ద బిలం ఏర్పడితే.. అమ్మో అనిపిస్తుంది కదా.. చిలీలోని టియెరా అమరిల్లా నగరానికి సమీపంలో ఉన్నట్టుండి భూమి కుంగిపోయి.. ఓ భారీ బిలం ఏర్పడింది. అది కూడా ఓ ఫ్యాక్టరీకి పక్కనే కావడం గమనార్హం. అదే ఇంకొంత పక్కన కుంగిపోయి ఉంటే అతి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.

50 అంతస్తుల బిల్డింగ్ అంత లోతుగా..
  • టియెరా అమరిల్లా నగర శివార్లలో అల్కపర్రోసా రాగి గనులు ఉన్నాయి. గత నెల 30వ తేదీన వాటి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో, మట్టి రోడ్డు ఉన్న చోట.. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి పెద్ద శబ్దం చేస్తూ కూరుకుపోయింది.
  • 104 అడుగుల (32 మీటర్లు) వెడల్పుతో.. ఏకంగా 656 అడుగుల (200 మీటర్ల) లోతుతో అతి భారీ బిలం ఏర్పడింది. అంటే సుమారు 50 అంతస్తుల భవనం అంత లోతు అన్నమాట.
  • అందులో అడుగున పెద్ద సరస్సులో ఉన్నట్టుగా నీరు నిండింది.
  • దీనిపై ఆ దేశ జియాలజిస్టులు పరిశీలన చేస్తున్నారు. బిలం ఏర్పడిన చోటు నుంచి చూట్టూ కొంత దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు.
  • అయితే చిలీలో ఏర్పడిన బిలం కచ్చితంగా వృత్తాకారంలో, ఎవరో కావాలని నిర్మించినట్టుగా ఉండటంపై ఆసక్తి నెలకొంది.
  • భూమి పొరల్లో అతి పెద్ద రాళ్లలో పగుళ్లు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మట్టి కిందికి దిగుతుందని, దీంతో ఉపరితలంలో బిలాలు ఏర్పడే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.