చవకగా లభించే చైనా ఫోన్లపై నిషేధం విధించే యోచనలో కేంద్రం!

08-08-2022 Mon 19:59
  • చైనా సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తున్న భారత్
  • ఇప్పటికే పలు నిషేధాజ్ఞలు
  • రూ.12 వేల కంటే తక్కువ ధరకు లభించే ఫోన్లపై నిషేధం!
Center mulls ban on cheaper China smart phones
కొంతకాలంగా భారత్, చైనా మధ్య సంబంధాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. గాల్వాన్ లోయలో ఘర్షణలు, ప్రాణనష్టం, తదితర అంశాల నేపథ్యంలో భారత్... చైనా పట్ల కటువుగా వ్యవహరిస్తోంది. భారత్ లో వ్యాపార కార్యకలాపాలు సాగించే చైనా సంస్థలు నిబంధనల పరిధి నుంచి తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. అవసరమైతే నిషేధాలకు కూడా వెనుకాడడంలేదు. 

ఈ క్రమంలో మరో నిషేధానికి కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రూ.12 వేల కంటే తక్కువ ధరకు లభించే చైనా ఫోన్లను భారత్ లో నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల మార్కెట్లలో భారత్ రెండో అతిపెద్ద విపణిగా ఉంది. ఇక్కడ షియోమీ, ఒప్పో తదితర చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల హవా నడుస్తోంది. కేంద్రం నిర్ణయంతో దిగువ శ్రేణి స్మార్ ఫోన్ సెగ్మెంట్ నుంచి చైనా సంస్థలు నిష్క్రమించకతప్పదు.

చైనా సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సెగ్మెంట్ ఇదే. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉన్న భారత్ లో రూ.12 వేల కంటే దిగువన లభించే ఫోన్లే అత్యధికంగా అమ్ముడవుతుంటాయి. ఈ సెగ్మెంట్లో చైనా సంస్థలకు అడ్డుకట్ట వేయాలని భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా సంస్థలు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రగాములుగా ఉన్నప్పటికీ, నష్టాలు వస్తున్నాయని చూపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.